Aug 16,2023 21:18

పారదర్శకంగా ఓటర్ల నమోదు
జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు

ప్రజాశక్తి చిత్తూరు అర్బన్‌
ఓటర్ల నమోదు కార్యక్రమం పారదర్శకంగా జరుగుతోందని, ఇందుకోసం క్షేత్రస్థాయి, మండల స్థాయి, అధికారులను నియమించడం జరిగిందని, బిఎల్‌ఏలు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులు అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని జాయింట్‌ కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో రాజకీయపార్టీలకు సంబంధించిన ప్రతినిధులతో ఓటర్ల మార్పులు చేర్పుల ప్రక్రియకు సంబంధించి సమావేశం డిఆర్‌ఓ ఎన్‌.రాజశేఖర్‌తో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ కొన్ని పార్టీలు ఇప్పటికే బిఎల్‌ఏలను నియమించుకోవడం జరిగిందని ఓటర్ల నమోదు మార్పులు, చేర్పులు సంబంధించిన ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు క్షేత్రస్థాయిలో బిఎల్వోలు పనిచేస్తున్నారని తెలిపారు. మండలస్థాయి నియోజకవర్గస్థాయి అధికారులను పర్యవేక్షణ కోసం నియమించడం జరిగిందన్నారు. ఇప్పటివరకు ఈ ప్రక్రియ దాదాపు 45 శాతం పూర్తి అయిందని వేగవంతంగా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్‌ కార్యక్రమం ఆఫ్‌లైన్‌ విధానంలో జరుగుతోందని తర్వాత ఆన్లైన్‌ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రక్రియలో ప్రధానంగా సపోర్టెడ్‌ డాక్యుమెంట్లు వచ్చిన తర్వాతనే నిర్వహించడం జరుగుతుందని మార్పులు చేర్పులు విషయంలో బిఎల్‌ఏలు బిఎల్‌ఓలతో కలిసి నిర్వహిస్తున్నారని అన్నారు. ఎక్కడ ఇటువంటి ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించడం జరుగుతుందన్నారు. తొలగింపులు జరగాలంటే తప్పనిసరిగా వారికి సమాచారం అందజేయడం జరుగుతుందని అంటూ ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు విషయంలో ఎటువంటి అజాగ్రత్తలు ఉండవని అన్నారు. ఇంకా ఏవైనా సమాచారాలు అవసరం అయితే ఓటర్‌ హెల్ప్‌లైన్‌ ద్వారా కూడా పరిశీలించు కోవచ్చుననన్నారు. బిఎస్పి తరపున లోకనాథన్‌, భాస్కర్‌, సిపిఐ నాగరాజన్‌, సిపిఎం సురేంద్ర, కాంగ్రెస్‌ నుంచి పరదేశి, టిడిపి నుంచి సురేంద్ర కుమార్‌, వైఎస్‌ఆర్సిపి నుంచి ఉదరు కుమార్‌లు పాల్గొన్నారు.