Jun 15,2022 23:05

పాలసేకరణపై అధికార్లతో సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్‌

పాలసేకరణ పెంచండి
అధికారులను ఆదేశించిన కలెక్టర్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌
: జిల్లాలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమంలో భాగంగా పాలసేకరణ పెరగాలని జిల్లాకలెక్టర్‌ యం.హరినారాయణన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్‌ జగనన్న పాలవెల్లువ కార్యక్రమం అమలు తీరుకు సంబంధించి సంబంధిత అధికారులతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో పాడి పరిశ్రమ మీద ఆధారపడి ఎక్కువ మంది రైతులు జీవిస్తున్నారని, జిల్లా వ్యాప్తంగా 23 రైతు భరోసా కేంద్రాల పరిధిలోని 74 కేంద్రాలలో ఒక రోజుకు 11840 లీటర్ల పాలసేకరణ లక్ష్యం కాగా ఈ లక్ష్యసాధనకు కషి చేయాలని, పాలసేకరణను పెంచాలన్నారు. పాల సేకరణను పెంచేందుకు క్షేత్రస్థాయిలో స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన పెంచాలన్నారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఇందుకు మండలస్థాయిలో ఎంపిడిఓ, సచివాలయ పరిధిలో గల వెటర్నరీ అసిస్టెంట్‌ను ఈకార్యక్రమంలో భాగస్వాములు చేయాలని తెలిపారు. పాలసేకరణ కార్యక్రమంను మిగిలిన గ్రామాలకు కూడా విస్తరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈసమావేశంలో డిఆర్‌డిఏ పీడీ తులసి, జడ్పీసిఈఓ ప్రభాకర్‌ రెడ్డి, డిస్టిక్‌ డైరీ డెవలప్మెంట్‌ ఆఫీసర్‌ రవిచంద్రన్‌, పశుసంవర్ధకశాఖ డిడి ప్రభాకర్‌, ఏపీ డైరీ మేనేజర్‌ నవీన్‌, తదితరులు పాల్గొ న్నారు.
నాడు- నేడు భవనాలను నాణ్యతతో పూర్తి చేయాలి
నాడు- నేడు కార్యక్రమంలో భాగంగా వైద్యఆరోగ్య శాఖలో భవననిర్మాణ పనులు నాణ్యత పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ యం.హరి నారాయణన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్‌ జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో ఆర్‌అండ్‌బి ఎస్‌ఈ దేవానందం, ఏపీఎం ఐడిసి ఈఈ ధనంజయ రెడ్డి, డిఎం అండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ శ్రీహరి, డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ నాయక్‌, ఆర్‌ అండ్‌బి ఈఈ శ్రీనివాసులు సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రిలో మౌలికవసతుల కల్పనలో భాగంగా నాడు-నేడు కార్యక్రమంను చేపట్టడం జరుగుతున్నదని అన్నారు. నాడు- నేడు కింద చేపట్టిన పనులు నాణ్యతతో పూర్తిచేయాలని, పనులను సంపూర్ణంగా పూర్తి చేయాలన్నారు. ఏపీఎం ఐడిసి ద్వారా జిల్లాలో నిర్మిస్తున్న కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్ల భవన నిర్మాణంలో పురోగతి తక్కువగా ఉన్నదని, నిర్ణీత గడువు లోపల భవనాలను పూర్తిచేసి ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు అందుబాటులోకి తీసుకొని రావాలని తెలిపారు. జిల్లాలో నాడు- నేడు కింద ఆర్‌అండ్‌బి శాఖ ద్వారా 47ఆస్పత్రులలో పునర్నిర్మాణ పనులు జరుగుతుండగా ఇందులో 40పనులు పూర్తి చేయడం జరిగిందని, కొత్తగా 3 పిహెచ్‌సి భవనాలు మంజూరు కాగా, ఈ మూడు భవన నిర్మాణాలు వివిధ దశల్లో కలవని ఎస్‌ఈ వివరించారు.