
* 'యువ గర్జన'లో జనసేన రాష్ట్ర నాయకులు విశ్వక్‌సేన్
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్ : జిల్లా వెనుకబాటుకు పాలకుల నిర్లక్ష్య వైఖరే కారణమని జనసేన రాష్ట్ర నాయకులు డాక్టర్ సయ్యద్ విశ్వక్‌సేన్ విమర్శించారు. నగరంలోని రామలక్ష్మణ కూడలి వద్ద జనసేన ఆధ్వర్యాన యువ గర్జనను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాకపోవడానికి, ఇక్కడి ప్రజలు పొట్ట చేత పట్టుకొని ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిపోవడానికి ప్రభుత్వాల విధానాలే కారణమన్నారు. జిల్లాలో సహజ సంపదలు ఉన్నాయని, సుదీర్ఘ తీరప్రాంతం ఉన్నా అభివృద్ధికి నోచుకోలేదన్నారు. చేపల వేట సాగక మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వలస కార్మికులు కనిపిస్తారని తెలిపారు. ఉద్యోగావకాశాల్లేక కుటుంబాలకు దూరంగా యువత వలస జీవులుగా ఉపాధి పొందుతున్నారని చెప్పారు. ఈ పరిస్థితులు మారాలన్న స్ఫూర్తితోనే యువగర్జనను ప్రారంభించామన్నారు. పవన్ కళ్యాణ్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడితే జిల్లా పరిస్థితులకు అనుకూలంగా అందరి జీవన స్థితిగతులు మెరుగుపరుస్తారని తెలిపారు. ఇందుకు సంబంధించి మేనిఫెస్టోను రూపొందిస్తామన్నారు. వైసిపి ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి, వలసల నివారణకు ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు గేదెల చైతన్య, పేడాడ రామ్మోహన్, కణితి కిరణ్, పలు జిల్లా, మండలస్థాయి నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.