ప్రజాశక్తి-రాయదుర్గం యువగళం పేరిట నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రకు ప్రజల్లో ఆదరణ లేకపోవడంతో వల్లే వైసిపి నాయకులు, కార్యకర్తలపై రెచ్చగొట్టే ధోరణిలో వారు వ్యవహరిస్తున్నారని వైసిపి అనంతపురం జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య అన్నారు. ఆదివారం రాయదుర్గంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరసింహయ్య విప్ కాపు రామచంద్రారెడ్డి, జెడ్‌పి ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పాదయాత్ర సందర్భంగా లోకేష్ ముఖ్యమంత్రి జగన్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపై అడ్డగోలు ఆరోపణలు చేసినా ప్రజల నుండి స్పందన లేకపోవడంతో పెయిడ్ ఆర్టిస్టులను, రోజు కూలీలను యాత్రలో ఉపయోగించి ప్రజలను మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు. పాదయాత్ర అట్టర్ ప్లాప్ అయిందన్నారు. మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రశాంతమైన జిల్లాలో టిడిపి కార్యకర్తలను రెచ్చగొట్టి, శాంతిభద్రతలకు భంగం కలిగే విధంగా లోకేష్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పుట్టపర్తిలో శనివారం జరిగిన అల్లర్లు అందుకు నిదర్శనమన్నారు. రాప్తాడులో శ్రీనివాస్ అనే కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారని తెలిపారు. లోకేష్ మూర్ఖుడని, తాను ఫ్యాక్షనిస్ట్‌గా మారుతానని, 20 కేసులు ఉంటేనే దగ్గరకు రమ్మని చెబుతున్నట్లు వ్యాఖ్యానించారు. కరువు లేదా ప్రజా సమస్యలు ఉంటే ఎవరైనా పాదయాత్ర చేస్తారన్నారు. రాష్ట్రంలో సుభిక్షమైన వాతావరణం నెలకొన్నప్పుడు లోకేష్ పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. లోకేష్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. మండలి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ద్వారా నాలుగు సీట్లను గెలవగానే రాష్ట్రంలోని ప్రజలందరూ ఏకపక్షంగా టిడిపికి తీర్పు ఇచ్చారని భ్రమ పడుతున్నారని అన్నారు. జెడ్‌పి ఛైర్మన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా జగన్ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారన్నారు. చంద్రబాబు, లోకేష్ దుష్ప్రచారం చేయడం, యువగళం పేరిట రెచ్చగొట్టే ధోరణి అవలంభించడం సరికాదన్నారు. యువతను, మహిళలను, పేదలను మోసం చేసింది మీరు కాదా, యాత్రకు స్పందన లేక రణరంగంగా మార్చింది మీరు కాదా అని ప్రశ్నించారు. విప్ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పప్పూ 'లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కనీసం వార్డు మెంబరుగా కూడా గెలవలేని లోకేష్ చేపట్టిన పాదయాత్రకు జనం లేకపోగా, కూలీ ఇచ్చి, సెల్ఫీలు తీయించి, డబ్బు వెదజల్లి యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అమరావతి పాదయాత్ర కూడా విఫలం అయిందని అన్నారు. టిడిపికి కాలం చెల్లిందని, ఇప్పటికైనా మారాలన్నారు. లేకుంటే వచ్చే ఐదేళ్లలో తామేమిటో చేసి చూపుతామని హెచ్చరించారు. లోకేష్ చేపట్టిన యువగళం యాత్ర డ్రామా అని, డబ్బాయాత్ర అని వ్యాఖ్యానించారు. విలేకరుల సమావేశంలో ఎపిఐఐసి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి, రాయదుర్గం ఎంపిపి విద్యావతి, జెడ్పిటిసి సభ్యులు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.










