Jul 19,2023 20:38

జిల్లా కలెక్టర్‌ పి ప్రశాంతి
ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
చేయూత లబ్ధిదారుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడేలా పాడి పశువుల కొనుగోలును ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టర్‌ ఛాంబర్‌లో కలెక్టర్‌ చేయూత గ్రౌండింగ్‌, పశుకిసాన్‌ క్రెడిట్‌ కార్డ్స్‌ జారీ అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ చేయూత లబ్ధిదారులు ఉపాధి మెరుగుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారులను ప్రోత్సహించి పాడి పశువులను కొనుగోలు చేయించాలని సూచించారు. పాడి పశువుల గ్రౌండింగ్‌ చాలా తక్కువ ఉండడంపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. మేలైన పాడి పశువులను గోకవరం, కంకిపాడు, విజయనగరం జిల్లా పెదనకలం తదితర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కనీసం 500 పశువులను వెంటనే గ్రౌండ్‌ చేయాలని సూచించారు. వివిధ పాడి రైతుల ద్వారా 3,140 లీటర్ల పాలను అమూల్‌ కేంద్రాలకు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నరసాపురంలో 737 లీటర్ల పాల సేకరణను వెయ్యి లీటర్లు, యలమంచిలిలో 490 లీటర్లకు గాను 700 లీటర్లు, పాలకొల్లులో 500లకు 700 లీటర్లు పాల సేకరణ లక్ష్యంగా పనిచేయాలన్నారు. జిల్లాలోని పాడి రైతులందరికీ పశు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను అందజేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న పాల వెల్లువ కింద నాలుగు మండలాల్లోని 31 గ్రామాల్లో చేసిన సర్వే అనుసరించి నాలుగు వేల పాడి రైతులకు డిసిసిబి ద్వారా పశు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను అందజేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఉద్యానవన శాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంపుదలకు అధికారులు కషి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మురళీకృష్ణ, డిఆర్‌డిఎ పీడీ ఎంఎస్‌ఎస్‌ వేణుగోపాల్‌, జిల్లా కోపరేటివ్‌ అధికారి రవికుమార్‌, లీడ్‌ బ్యాంకు జిల్లా మేనేజర్‌ ఎ.నాగేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.