Jul 23,2023 20:52

ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కోరుతూ పట్టణంలో స్వచ్ఛంద సంస్థలు రెవెన్యూ శాఖ సహకారంతో అవగాహన ప్రచార కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ మేరకు బ్రోచర్లను ఆనంద్‌ ఇన్‌లో ఆర్‌డిఒ దాసి రాజు, డిఎస్‌పి శ్రీనాథ్‌ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ప్రజా స్వామ్య పరిరక్షణలో ఓటు ఒక వజ్రా ఆయుధమన్నారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడుతుందన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ భీమవరం ప్రాంతంలోని స్లమ్‌ ఏరియాలో పల్లె గ్రామాల్లో కూడా అవగాహన కార్యక్రమాలను రెవెన్యూ శాఖ సహకారంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ప్రచార కమిటీ సభ్యులు కంతేటి వెంకటరాజు, సిఐ కృష్ణకుమార్‌, ఎస్‌ఐ అప్పారావు పాల్గొన్నారు.