
* యువత ఓటర్లుగా నమోదు చేసుకోవాలి
* ఇప్పటికే ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల
* మార్పులు, చేర్పులకు డిసెంబరు 9 వరకు గడువు
* జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: మనల్ని పాలించే ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు ఓటు హక్కు కీలకమని, అర్హులైన యువత ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాలను అనుసరించి వచ్చే ఏడాది నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికల కోసం ముసాయిదా ఓటర్ల జాబితాను నియోజకవర్గాల వారీగా వెల్లడించామన్నారు. జాబితాలో చేర్పులు, మార్పులకు డిసెంబరు తొమ్మిదో తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. జాబితాలో ఓటు లేకుంటే తిరిగి నమోదు చేసుకునేందుకు వీలు కల్పించామన్నారు. అన్ని వర్గాల సహకారంతో ఓటర్ల జాబితా ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పలు అంశాలను 'ప్రజాశక్తి' ముఖాముఖిలో వెల్లడించారు.
జిల్లాలో ఇప్పటికే ఓటర్ల ముసాయిదా జాబితా విడుదలైంది. ఇందులో లోపాలు ఉంటే ఎవరికి ఫిర్యాదు చేయాలి?
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల డ్రాఫ్ట్ రోల్ (ముసాయిదా జాబితా)ను ఇప్పటికే విడుదల చేశాం. డిసెంబరు తొమ్మిదో తేదీ వరకు ఓటర్ల జాబితాలో మార్పులకు, చేర్పులకు 45 రోజులు అవకాశం కల్పించాం. ఫిర్యాదుల కోసం నవంబరు 4, 5, డిసెంబరు 2, 3 తేదీల్లో వీలు కల్పించాం. పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవల్ అధికారులతో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నాం. 12వ తేదీ వరకు స్వీకరించిన ఫిర్యాదులను పరిశీలిస్తాం. వాటిని డిసెంబరు 26వ తేదీ నాటికి పరిష్కరించి జనవరి ఒకటో తేదీన నుంచి చివరి దశ పరిశీలిస్తాం. చివరిగా ఎలక్ట్రోల్ పబ్లికేషన్‌ను జనవరి 5న విడుదల చేస్తాం.
ఓటర్ల నమోదు కోసం ప్రత్యేక క్యాంపెయిన్‌ను నిర్వహిస్తున్నారా?
జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో 18,27,143 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 9,08,440 మంది పురుషులు, 9,18,528 మహిళా ఓటర్లు ఉన్నారు. వీరి కోసం జిల్లాలో 2,357 పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే గుర్తించాం. ప్రతి వెయ్యి మంది జనాభాలో 758 మంది ఓటర్లు ఉన్నారు. సర్వీసు ఓటర్ల సంఖ్య 16,162 మంది వరకు ఉన్నారు. డిఫెన్సు, ఇతర కేంద్ర సర్వీసుల్లో ఉన్న సర్వీసు ఓటర్లు ఎక్కువగా ఉన్న జిల్లాగా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉన్నాం. 50 వేల మంది వరకూ కొత్తగా ఓటర్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు 20 వేల మంది యువకులు మాత్రమే నమోదు చేసుకున్నారు. మిగిలిన వారు డిసెంబరు 9లోగా తమ పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది. అందుకోసం విస్తృత ప్రచారం, ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తాం. ఫైనల్ రోల్‌ను మదర్ రోల్‌గా పరిగణిస్తాం. జనవరి తర్వాత ఓటర్లుగా నమోదైతే వారిని సప్లిమెంటరీ జాబితాల్లో పొందుపరుస్తాం.
ఓటరుగా నమోదుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?
అర్హత ఉన్న ప్రతిఒక్కరూ ఓటు హక్కు పొందేలా బిఎల్‌ఒ స్థాయి నుంచి చర్యలు చేపడుతున్నాం. కలెక్టర్ ఆదేశాలను అనుసరించి అన్ని వర్గాలు సమన్వయం కోరుతున్నాం. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలతో సమన్వయం చేసుకునేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నాం. బిఎల్‌ఒ స్థాయి నుంచి ఎఇఆర్‌ఒ, విఆర్‌ఒ స్థాయిలో ఫిర్యాదుల పరిష్కారానికి వ్యక్తిగతంగా ఐదు కంటే ఎక్కువ ఫిర్యాదులను అంగీకరించడం లేదు.
ఓటరు జాబితాలో పేర్లు ఉన్నదీ? లేనిదీ ఎలా గుర్తించగలం?
ఓటర్లు తమకు ఓటు హక్కు ఉన్నది, లేనిదీ తెలుసుకునేందుకు బూత్ లెవల్ ఏజెంట్లను సంప్రదించాలి. ఇసిఐ వెబ్సైట్ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఓటర్స్, ఇసిఐ.జిఒవి.ఇన్ ద్వారా కూడా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఓటర్ హెల్ప్ లైన్ (విహెచ్‌ఎ) అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఓటు వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే టోల్ ఫ్రీ నంబరు 1950 ద్వారా కూడా సమాచారం తెలుసుకోవచ్చు. జాబితాలో పేరు లేకపోతే ఫారం-6ను సమర్పించడం ద్వారా ఓటు హక్కును తిరిగి పొందవచ్చు.
ఇవిఎంల తనిఖీలు ఎంతవరకు పూర్తి చేశారు?
ఎలక్ట్రానిక్ ఓటరు యంత్రాలను కలెక్టరేట్‌లోని గోదాముల్లో పరిశీలన చేపడుతున్నాం. సాంకేతిక నిపుణుల బృందంతో సాంకేతికపరమైన అనేక అంశాలను, రాజకీయ పార్టీల ప్రతినిధుల అనుమానాలను నివృత్తి చేస్తున్నాం.