Aug 01,2023 21:38

తోసులాడుకుంటున్న టిడిపి, వైసిపి నాయకులు

            ఉరవకొండ : నియోజకవర్గంలో తమ పార్టీకి చెందిన సానుభూతిపరుల ఓటర్లు తొలగిస్తున్నారని టిడిపి, చనిపోయిన వారివి, స్థానికంగా లేని వారి ఓటర్లను తొలగించాలని వైసీపీ నాయకుల మధ్య నడుస్తున్న వివాదం మంగళవారం ఉరవకొండలో ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక ఎంపిడిఒ కార్యాలయ సభా భవనంలో నియోజకవర్గ ఎన్నికల ఓటర్ల నమోదు పరిశీలకులు, జెడ్పీ సీఈఓ భాస్కర్‌రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గంలోని తహశీల్దార్లు, రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టిడిపికి చెందిన నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలో టిడిపి సానుభూతిపరులకు చెందిన 7800 ఓట్లు తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని నిలదీశారు. ఇందుకు కౌంటర్‌గా వైసిపి నాయకులు కేవలం చనిపోయిన వారివి, స్థానికంగా లేని వారివి మాత్రమే తొలగించాలని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు స్పందించిన ఓటర్‌ నమోదు పరిశీల కులు భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకూ ఎవరి ఓట్లూ తొలగించలేదని, అభ్యంతరాలను మాత్రమే పరిశీలిస్తున్నామని చెప్పారు. ఆయన మాట్లాడుతు ండగానే టిడిపి, వైసిపి నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఘర్షణకు దిగారు. దీంతో సమావేశం రసాభాసగా మారి తోపులాటకు దారితీసింది. ఉరవకొండ అర్బన్‌ సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ హరినాథ్‌ ఆధ్వర్యంలో పోలీసులు ఇరు పార్టీల నాయకులకు సర్ధిచెప్పారు. అనంతరం టిడిపి నాయకులు ఎంపిడిఒ ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమావేశంలో వైసిపి నాయకులు తమపై దాడి చేసేందుకు పూనుకోవడం బాధాకరమన్నారు. ఓటరు నమోదు, తొలగింపు కార్యక్రమం పారదర్శకంగా జరగాలన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా, టిడిపికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.