ఓటర్ల నమోదు...నిరంతర ప్రక్రియ
ప్రజాశక్తి -చిత్తూరుఅర్బన్
ఓటరు నమోదు కార్యక్రమం ఒక నిరంతర ప్రక్రియని, రాజకీయ పార్టీలతో అధికార యంత్రాంగం సమన్వయం చేసుకుని పకడ్భందీగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియను నిర్వహించాలని చిత్తూరు, తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాల ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్, రాష్ట్ర మార్క్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రద్యుమ్న పి.ఎస్. తెలిపారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో విలేకరులతో ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ మాట్లాడుతూ జిల్లా ఎన్నికల అధికారి జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఓటరు జాబితా సవరణలో రాజకీయ ప్రతినిధులతో సమావేశం కావాలని తెలిపారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పుల విషయంలో వారికి తగిన సూచనలు, సలహాలు అందించాలని తెలిపారు. ఇందులో అభ్యంతరాలను ఉంటే స్వీకరించి వాటికి ఎన్నికల చట్టాలను అనుసరించి పరిష్కారం చూపాలని తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో ఓటరు జాబితాను పారదర్శకంగా సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఓటరు జాబితాను తయారు చేయడంలో నియమింపబడిన అధికారులు, సిబ్బంది జాగ్రత్తగా తప్పులకు తావు లేకుండా భాద్యతగా నిర్వహించాలని తెలిపారు. రాజకీయ నాయకులు బూత్ లెవల్ లో ఏజెంట్ లను నియమించుకోవాలని తెలిపారు. ప్రజాస్వామ్యం లో ఎన్నికలు చాలా ప్రాముఖ్యమైన అంశమని, అధికారులు ఓటరు జాబితాను పకడ్భందీగా తయారు చేసుకోవడం ద్వారా ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు దోహదపడుతుందని తెలిపారు.
3, 4 తేదీల్లో స్పెషల్ క్యాంపెయిన్
. ఓటరు నమోదు ప్రక్రియకు సంబంధించి జిల్లాలో 10,888 అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయని, అందులో ఫారం-6 కు సంబంధించి అధిక సంఖ్యలో పెండింగ్ లో ఉన్నాయని, దీనిని త్వరగా పరిష్కరించాలని ప్రద్యుమ్న తెలిపారు. డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ కు వివరిస్తూ చిత్తూరు జిల్లా విస్తీర్ణం 6,859 చ. కి.మీ లు ఉందని, జిల్లాలో 31 మండలాలు, 822 రెవెన్యూ గ్రామాలు, 697 గ్రామ పంచాయతీలు, 07 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 18.73 లక్షలని, ఇందులో 9.40 లక్షల మంది పురుషులు, 9.33 లక్షల మంది స్త్రీలు ఉన్నారని తెలిపారు. డిసెంబర్ 3, 4 తేదీలలో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించనున్నామని, 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులను ఓటర్లుగా నమోదు చేసేందుకు స్వీప్ ఆక్టివిటీని కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో నిర్వహిస్తున్నట్లు వివరించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ 18,19 సంవత్సరాల వయసు ఉన్న యువకులు జిల్లాలో 40 వేల మందిపైన ఉంటే కేవలం 3వేల మంది ఓటు నమోదు చేసుకున్నారన్నారు. దీనిపై విస్తత ప్రచారం జరిపి అందర్నీ ఓటు నమోదు అయ్యే విధంగా అధికార యంత్రాంగం చొరవ తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి సురేంద్రకుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పరదేశి, బిఎస్‌పి నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ ఎన్. రాజశేఖర్, పుంగనూరు, నగరి, జి.డి నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం ఈఆర్‌ఓ లు ప్రభాకర్ రెడ్డి, సుజన, భవాని, రేణుక, పర్వీన్, జి. రామకష్ణా రెడ్డి, శివయ్య పాల్గొన్నారు.










