ఓటర్ల నమోదుకు రాజకీయ పార్టీలు సహకరించాలి
జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:
జిల్లాలో 18 సంవత్సరాల నిండిన యువతను ఓటరుగా నమోదు చేయించుటకు అధికారులతో పాటు రాజకీయపార్టీల నాయకులు సహకరించాలని జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ సమావేశం హాల్‌లో డిఆర్‌ఓ ఎన్.రాజశేఖర్‌తో కలసి ఎస్‌ఎస్‌ఆర్ 2024పై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 18 సంవత్సరాల నిండిన యువతను ఓటరుగా నమోదు చేయించుటకు అధికారులతో పాటుగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు గుర్తించి ఓటరుగా నమోదు చేయించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఒకే ఇంటిలో 10 ఓట్లు కంటే ఎక్కు మంది ఓటర్లు ఉన్న ఇళ్లను గుర్తించి ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేయడం జరిగిందని తెలిపారు. ఈనెల 22న మళ్ళీ ఒక్కసారి రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి ఫైనల్ ఓటర్ జాబితాను రాష్ట్ర ఎన్నికల అధికారికి పంపించడం జరుగుతుందని తెలిపారు. వివాహమైన మహిళలు ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి ఓట్లు గుర్తించి ఓటరు జాబితా నుండి తొలిగించాలని బియల్‌ఓలకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటికే సాధమైనంతవరకు పరిశీలించి తొలగించడం జరిగిందని ఇంకా ఏమైనా ఉంటే వాటిని పరిశీలించాలి తొలగించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్స్‌తో సమావేశం నిర్వహించి 18 సంవత్సరాలు నిండి వారు ఇంకా ఓటర్‌గా నమోదు చేసుకోకుంటే అలాంటి వారికి ప్రత్యేక డ్రైవ్ ఏర్పటు చేయించి, ప్రతి ఒక్కరినీ ఓటర్‌గా నమోదు చేయించడం జరుగుతుందన్నారు. సమావేశం వైఎస్సార్ సిపి నుంచి ఉదరు, టిడిపి సురేంద్ర కుమార్, సిపిఎం నుంచి వాడ గంగరాజు, సిపిఐ నాగరాజు, కాంగ్రెస్ పార్టీ నుంచి పరదేసి, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










