Oct 30,2023 22:19

టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

* 15 రోజుల్లోగా క్లయిమ్‌లను పరిష్కరించాలి
* బిఎల్‌ఒలను ఆదేశించిన కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
ఓటర్ల నమోదుకు నవంబర్‌ 11, 12, డిసెంబర్‌ 2, 3 తేదీల్లో పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ వెల్లడించారు. ఓటరుగా నమోదు కాని 18 ఏళ్లు దాటిన వారు నమోదు చేసుకోవాలని కోరారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 27 వేల క్లయిమ్‌ల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బిఎల్‌ఒలు, ఎఇఆర్‌ఒలు, ఇఆర్‌ఒలతో సోమవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. క్లయిమ్‌ల పరిష్కారానికి 15 రోజుల గడువు విధిస్తున్నామన్నారు. గడువు కంటే ముందే వాటిని పూర్తి చేసేలా పనిచేయాలన్నారు. ఫారం-7 అప్లికేషన్లను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇఆర్‌ఒలు, ఎఇఆర్‌ఒలు క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసువాలని సూచించారు. ఓటర్ల నమోదుకు బూత్‌ లెవల్‌ అధికారులతో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్న దృష్ట్యా ఆయా కేంద్రాల్లో ఎన్నికల విధులకు సంబంధించిన అధికారుల ఫోన్‌ నంబర్లతో కూడిన జాబితాను స్పష్టంగా కనిపించేలా ఉంచాలని ఆదేశించారు. ఆయా రోజుల్లో వచ్చే క్లయిమ్‌లతో సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున, ఏ చిన్న పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకతతో సమర్థవంతంగా పనిచేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న 27వేల క్లయిమ్‌ల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఓటర్లకు సంబంధించిన వెబ్‌సైట్‌, ఎన్నికల కమిషన్‌ రూపొందించిన యాప్‌ల గురించి ఓటరుకు అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో 18 ఏళ్లు నిండిన అర్హత కలిగిన వారికి ఓటు హక్కు కల్పించేలా ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్‌ బూత్‌ స్థాయిలో కొత్త ఓటర్ల నమోదుకు కృషి చేయాలన్నారు. ఒకే ఇంటి నంబరుతో పది కంటే ఎక్కువ ఓట్లు ఉన్న ఇళ్లను గుర్తించి, వచ్చే 15 రోజుల్లో విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. బిఎల్‌ఒ స్థాయి నుంచి ఎఇఆర్‌ఒ, ఇఆర్‌ఒ స్థాయిలో ఫిర్యాదుల పరిష్కారానికి వ్యక్తిగతంగా ఐదు కంటే ఎక్కువ ఫిర్యాదులను అంగీకరించవద్దని స్పష్టం చేశారు.