
* ఎమ్మెల్యే బెందాళం అశోక్
ప్రజాశక్తి - కవిటి: ఓటమి భయంతోనే వైసిపి ప్రభుత్వం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసులు బనాయించి, అక్రమంగా అరెస్టు చేసిందని ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. మండలంలోని రామయ్యపుట్టుగలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్కిల్ డెవలప్‌మెంట్, ఫైబర్ నెట్‌లో అక్రమాలు జరిగాయని నెల రోజులుగా గొంతు చించుకుంటున్న వైసిపి నేతలు ఒక్క రూపాయి కూడా నిరూపించలేకపోయారని ఎద్దేవా చేశారు. దళిత యువకుడిని హత్య చేసిన వైసిపి ఎమ్మెల్సీ దర్జాగా బయట తిరుగుతుంటే, నిరంతరం ప్రజా క్షేమం కోసం పరితపించే చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి నేతలు అవినీతి అంటూ గొంతు చించుకుంటున్న ఫైబర్ గ్రిడ్ కోసం రూ.250 కోట్లు ఖర్చు పెడితే రూ.900 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందన్నారు. చంద్రబాబుపై పెట్టిన పెట్టిన కేసు రిమాండ్ రిపోర్ట్ పేజీ నంబరు 16లోని ఒక పేరాలో రూ.145.37 కోట్లని, మరో పేరాలో 290 కోట్లని, పేజీ నంబర్ 21లో అసలు ఆ సొమ్ము ఎటు వెళ్లిందో తమకు తెలియదని సిఐడి చెప్పడం ఈ కేసు ఎవరి స్వార్థం కోసం పెట్టారో తెలుస్తోందన్నారు. ఇటువంటి అక్రమ కేసులు ఎన్ని పెట్టినా భయపడేది లేదని, తాము ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామన్నారు. సమావేశంలో టిడిపి నాయకులు బెందాళం రమేష్, పిరియా సూర్యారావు, కిమ్మోజు కుమారస్వామి, కిమ్మోజు యోగి తదితరులు పాల్గొన్నారు.