Nov 05,2022 11:23

ప్రజాశక్తి- రాజోలు: టిడిపి నేత చింతకాయల అయ్యన్నపాత్రుడును తను ఆక్రమించి కట్టిన ఇంటి నిర్మాణానికి సంబంధించి పత్రాలని ఫోర్జరీ చేసిన కేసులో సిఐడి అధికారులు అతడ్ని, అతని కుమారులను అరెస్ట్ చేస్తే దానికి మా పార్టీకి ఏమి సంబంధమని, అది చట్ట ప్రకారం అధికారులు తీసుకునే చర్యలని వైసిపి యువజన రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర నెడ్ క్యాప్ డైరెక్టర్ పాటి శివకుమార్ అన్నారు. సఖినేటిపల్లిలో తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అయ్యన్నపాత్రుడు చట్ట విరుద్ధంగా చేసిన తప్పుడు పనిని పక్కన పెట్టి ఒక బీసీ నాయకుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారు అని టిడిపి నాయకులు ముసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. అయ్యన్నపాత్రుడు బీసీల కోసం ఏం చేశాడని, పదవుల కోసం అధికారం కోసం బిసిలని వాడుకున్న టిడిపి నాయకులు చవకబారు విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా టీడీపీని బీసీలు నమ్మరని, సీఎం జగన్ ఆధ్వర్యంలో బీసీలు సంక్షేమంగా ఉన్నారని శివకుమార్ అన్నారు.