Oct 05,2023 22:28

రిమ్స్‌ ఆస్పత్రి

* వృద్ధులు, గ్రామీణ ప్రజలకు తప్పని కష్టాలు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌ : 
ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో వైద్యం సేవలు పొందాలంటే ఇకపై సెల్‌ఫోన్‌ ఉండాల్సిందే. ఒపి చీటీ కావాలంటే ఒటిపి చెప్పాల్సిందే. రోగానికి వైద్యం కావాలని వచ్చిన వారు క్యూలైన్లలో వేచి ఉండి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న తర్వాత, ఒటిపి వస్తే తప్ప వైద్యం అందించరు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఆన్‌లైన్‌ నిబంధనతో ముఖ్యంగా వృద్ధులు, గ్రామీణ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
ప్రభుత్వ సర్వజనాస్పత్రికి వైద్యం కోసం వచ్చే రోగులకు ముందుగా పేరు నమోదు చేసుకోవడం తప్పనిసరి. గత నెల 30వ తేదీ వరకు ఈ విధంగా నమోదు చేసేవారు. ఈనెల ఒకటో తేదీ నుంచి కొత్త ప్రక్రియను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆస్పత్రికి వచ్చే రోగుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. ఇందుకు వారి ఆధార్‌తో లింక్‌ అయిన మొబైల్‌కు ఒటిపి వస్తుంది. ఈ ఒటిపిని ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అకౌంట్‌ (ఎబిహెచ్‌) అనే యాప్‌లో ఎంటర్‌ చేసి, పేరు, వయసు, ఊరు, చిరునామా, పిన్‌కోడ్‌ నంబరుతో సహా సమగ్రంగా అందిస్తే ఒపి రిజిస్ట్రేషన్‌ అవుతుంది. ఆస్పత్రిలో మొబైల్‌ నెట్‌వర్క్‌ ఇబ్బందులున్న ఒక్కోసారి ఒటిపి రాకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రక్రియపై అవగాహన లేని గ్రామీణ ప్రజలు, వృద్ధులకు అవస్థలు తప్పడం లేదు. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ప్రతిరోజూ సుమారు 600 నుంచి వెయ్యి మంది వరకు అవుట్‌పేషెంట్లు వస్తుంటారు. సీజనల్‌ వ్యాధుల సమయంలో ఈ సంఖ్య పెరుగుతుంది. ఒటిపి ద్వారా ఒపి అందుకోవాలంటే నంబరు జనరేట్‌ కావడానికి ఒక్కోసారి సమయం పడుతుంది. ఆ తర్వాత ఒపి నమోదు క్రమసంఖ్య అక్కడున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లకు చెప్పాలి. వారు తిరిగి నమోదు చేసి ఒపి స్లిప్‌ ఇస్తున్నారు. ఈ ప్రక్రియ తెలియక ఆసుపత్రికి వస్తున్న రోగులు అష్టకష్టాలు పడుతున్నారు.
ఒటిపి కోసం మెడికోలు, స్టాఫ్‌ నర్సుల సాయం
ఎబిహెచ్‌ఎ యాప్‌లో వివరాల నమోదుకు రోగులు కొంతమంది మెడికో విద్యార్థులు, స్టాఫ్‌ నర్సులు, నర్సింగ్‌ విద్యార్థులను ఆశ్రయిస్తున్నారు. వారికి తీరిక ఉంటే తప్ప నమోదు సాధ్యం కావడం లేదు. ఎబిహెచ్‌ఎ యాప్‌లో రోగి వ్యక్తిగత ఫోన్‌ నంబరుతో లాగిన్‌ కావడం, ఆ నంబరుకు వచ్చే ఒటిపిని నమోదు చేస్తే తప్ప వివరాలు నమోదు కాకపోవడంతో నిరక్షరాస్యులు, వృద్ధులు కొన్ని సందర్భాల్లో వెనుదిరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి.
ఆయుష్మాన్‌ భారత్‌ యాప్‌లో నమోదు
రిమ్స్‌ ఆస్పత్రిలో ఒపి సంఖ్య గణనీయంగా పెరిగింది. వారికి తగ్గటుగా ఒపి స్లిప్‌ సకాలంలో ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌ అమల్లో భాగంగానే ఒటిపి విధానం అమలు చేస్తున్నాం. ఆధార్‌ కార్డుకు ఫోన్‌ నంబరు లింక్‌ అయి ఉంటే వైద్యం కోసం వచ్చే రోగులకు ఒటిపి వచ్చిన వెంటనే వారి పూర్తి డేటా వచ్చేస్తుంది. కొత్త విధానానికి అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది. ఇబ్బందులను అధిగమించి ఈ విధానాన్ని అమలు చేస్తున్నాం. రోగులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం.
- స్వామినాయుడు, సూపరింటెండెంట్‌, ప్రభుత్వ సర్వజనాస్పత్రి