ఎపి జెఎసి అమరావతి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేష్
కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల ధర్నా
ప్రజాశక్తి - భీమవరం
ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్‌ను రద్దు చేసి ఒపిఎస్‌ను పునరుద్దరించాలని ఎపి జెఎసి అమరావతి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్‌వి.రాజేష్ డిమాండ్ చేశారు. ఎపి జెఎసి అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిపిఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమస్యలపై కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు తరలొచ్చి ధర్నాలో పాల్గొన్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా ఫ్ల కార్డులు చేతబూని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ సిపిఎస్ రద్దుకు ఎన్నికల ముందు జగన్ హామీ ఇచ్చి అధికారం చేపట్టాక హామీని అమలు చేయకపోవడం దారుణమన్నారు. ఇచ్చిన హామీలు తక్షణం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ పరిపాలనాధికారి వై.దుర్గాకిషోర్ మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తక్షణం ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ డిఎలను, బకాయిలను వెంటనే ఇవ్వాలని కోరారు. ఎపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ వివి.పెద్దిరాజు మాట్లాడుతూ మార్చి తొమ్మిదో తేదీ నుండి ఉద్యమం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెకూ వెనుకాడబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎపి జెఎసి అమరావతి జిల్లా అధ్యక్షులు ఎస్.శివశంకర్, కార్యదర్శి ఫణి, ఎపిఆర్‌ఎస్‌ఎ జిల్లా కార్యదర్శి ప్రసాదరాజు, గ్రామ, వార్డు సచివాలయాల రాష్ట ట్రెజరర్ జగదీష్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ రాంబాబు, సీనియర్ సహాయకులు వివి.పెద్దిరాజు, పి.జగన్మోహన్, కె.వరప్రసాద్, జి.కళ్యాణి, కె.కల్యాణి, పి.గౌతమి, పివి.సాంబశివరావు, కె.సురేష్ తదితరులు పాల్గొన్నారు.










