ప్రజాశక్తి - భీమవరం
పాత పెన్షన్ విధానం అమలయ్యే వరకూ పోరాటం సాగిస్తామని యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి అన్నారు. భీమవరం యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో యుటిఎఫ్ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు పిఎస్.విషయరామరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గోపీమూర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో సిపిఎస్ రద్దు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చి పాత పెన్షన్‌ను అమలు చేయలేదని విమర్శించారు. జిపిఎస్ ఇస్తామని మాయ మాటలు చెబుతున్నారన్నారు. సిపిఎస్‌కు ప్రత్యామ్నాయం జిపిఎస్ కాదని ఒపిఎస్ మాత్రమేనని తెలిపారు. ఒపిఎస్ సాధించే వరకూ పోరాటం సాగిస్తామన్నారు. 117 జిఒ వల్ల ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయని, ఈ జిఒను రద్దు చేసి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. 12వ పిఆర్‌సి కమిటీని నియమించి చేతులు దులుపుకుంటే సరిపోదని ఇంటిరియలు రిలీఫ్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎకెవి రామభద్రం మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన అక్రమ బదిలీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బదిలీలు, రిఅపార్స్‌మెంట్ వల్ల జీతాలు రాక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని తక్షణం జీతాలు అందించాలని డిమాండ్ చేశారు. ప్యాప్టో ఆధ్వర్యంలో ఈ నెల 26, 27, 28 మండల కేంద్రంలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా సహాధ్యక్షులు కె.రాజశేఖర్, జిల్లా కోశాధికారి సిహెచ్ పట్టాభి రామయ్య, జిల్లా కార్యదర్శులు జయకుమార్, రత్న రాజు, శివప్రసాద్, రామకృష్ణంరాజు, రామకృష్ణ ప్రసాద్, కుమార్ బాబ్జి, శ్రీనుబాబు, ఏసుబాబు, సాయిరాం లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.










