Oct 17,2023 19:49

మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ కోటంరెడ్డి

మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ కోటంరెడ్డి
ఒంటరిగా లక్ష మందిని కలువనున్న రూరల్‌ ఎంఎల్‌ఎ
-24 నుంచి 33 రోజులు
ప్రజాశక్తి-నెల్లూరు:తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా రూరల్‌ ఎంఎల్‌ఎ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నిర్వహిస్తున్న సంఘీభావ సదస్సులో భాగంగా మంగళవారం రూరల్‌ ఎంఎల్‌ఎ కార్యాలయంలో ముస్లిం నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీ దసరా పండుగ పర్వదినం రోజునుంచి 33 రోజుల పాటు రూరల్‌ నియోజక వర్గ పరిధిలో లక్షమందిని కలిసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ప్రజలు తమ వంతు సహకారం అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం 6 నుండి రాత్రి 10 వరకు ఒక్కడినే, హంగు ఆర్భాటాలకు దూరంగా నిరాడంబరంగా ఒంటరిగా పర్యటించనున్నట్లు ప్రకటించారు. ముస్లీం మైనార్టీలకు అత్యంత ప్రధానమైన బారాషాహీద్‌ దర్గా అభివద్ధికి, మసీదు నిర్మాణానికి రూ.15 కోట్లు విడుదల చేయించామని అయితే రూ. 4 కోట్లు పనులు మాత్రమే పూర్తియినట్లు తెలిపారు. బిల్లు రాలేదని మిగతా పనులు మధ్యలోనే కాంట్రాక్టర్‌ నిలిపి వేశారన్నారు. మసీదు నిర్మాణానికి టెండర్లు పిలిచి 3 నెలలు కావస్తున్నా ఇప్పటివరకు ఒక్క ఇటుక పేర్చలేదన్నారు.
గత తెలుగుదేశం పార్టీ హయాంలో ముస్లిం మైనారిటీ గురుకుల పాఠశాల 95 శాతం పూర్తి కాగా వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 7 నెలల్లో మిగిలిన 5 శాతం పనులు పూర్తి చేయలేకపోవడం దారుణమన్నారు. ప్రస్తుతం ముస్లీం మైనారీటీ గురుకుల పాఠశాల ఆటో నగర్‌ షెడ్లలో ఉందని, విద్యార్ధులు ఈ ప్రాంతంలో వెలువడుతున్న కాలుష్యం బారినపడి అనారోగ్యానికి గురౌతున్నారన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లీం మైనార్టీ గురుకుల పాఠశాలకు సంబంధించిన నిర్మాణ పనులు పూర్తి చేసి అందజేస్తామని నారా లోకేష్‌ ఇచ్చిన హామీని అమలు చేసి తీరుతామన్నారు. ముస్లిం మైనారిటీలకు ఎప్పుడు తాను అండగా ఉంటానని, రూరల్‌ నియోజకవర్గంలో ముస్లిం సమాజం నాకు ఎప్పుడు అండగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, హయత్‌ బాబా, మౌలానా అజీజ్‌, సాబీర్‌ ఖాన్‌, షంషుద్దీన్‌, అసిఫ్‌ బాషా, నయతుల్లా, నన్నే సాహెబ్‌, మండల కోఆప్షన్‌ మెంబర్‌ మొహిద్దీన్‌, జడ్పీటీసీ కోఆప్షన్‌ మెంబెర్‌ అల్లాబక్షు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎం.ఎస్‌.ఎం.ఈ. డైరెక్టర్‌ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.