
* కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
ప్రజాశక్తి - శ్రీకాకుళం: ఒకరి రక్తదానంతో ముగ్గురికి ప్రాణదానం చేయవచ్చని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. రక్తంలోని ఎర్ర రక్తకణాలను రక్తహీనత, ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి, ప్లాస్మాను బ్లీడింగ్ డిజార్డర్ వ్యాధితో ఉన్న వారికి, ప్లేట్‌లెట్స్‌ను డెంగ్యూ వంటి జ్వరంతో బాధపడే వ్యక్తికి ఇవ్వడం ద్వారా ముగ్గురి ప్రాణాలను కాపాడినట్లవుతుందని తెలిపారు. ఇంజినీర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని జలవనరులశాఖ కార్యాలయంలో రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యాన గురువారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదాన శిబిరాల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా రక్తదానం చేసేందుకు జలవనరుల శాఖ అధికారులు, సిబ్బంది ముందుకు రావడం సంతోషకరమన్నారు. ఇదే స్ఫూర్తితో అన్ని శాఖలు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. జిల్లాలో 170 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఉన్నందున ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని తెలిపారు. ప్రమాదాలకు గురైన బాధితులకు సరిపడా రక్త నిల్వలు లేవన్నారు. రక్తదానం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందనే అపోహ చాలామందిలో ఉందని, కానీ రక్తదానం ద్వారా ఆరోగ్యం మరింత మెరుగుపడుతుందని తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యవంతులు మూడు నెలలకోసారి రక్తదానం చేయొచ్చని చెప్పారు. తొలుత జలవనరుల శాఖ కార్యాలయ ప్రాంగణంలో మొక్కను నాటారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సంస్థ జిల్లా చైర్మన్ పి.జగన్మోహనరావు, జలవనరుల శాఖ, వంశధార పర్యవేక్షక ఇంజినీర్లు డోల తిరుమలరావు, బి.సుధాకర్, కార్యనిర్వాహక, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్లు, సిబ్బంది, రెడ్‌క్రాస్ కోఆర్డినేటర్ సత్యనారాయణ, పి.చైతన్యకుమార్, నిక్కు అప్పన్న తదితరులు పాల్గొన్నారు.