కార్పొరేట్ కళాశాలలపై ఎస్‌ఎఫ్‌ఐ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం
ప్రజాశక్తి - భీమవరం
తల్లిదండ్రులూ మీ పిల్లలను కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారా ఒక్క క్షణం ఆలోచించండి అంటూ ఎస్‌ఎఫ్‌ఐ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా పదో తరగతి పరీక్షలు ముగిసిన నేపథ్యంలో ఆయా పాఠశాలల వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ముద్రించిన కరపత్రాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలు ముగియడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కార్పొరేట్ కళాశాల అడ్మిషన్స్ కోసం పరుగులు పెడుతూ ఉంటారని పేర్కొన్నారు. కార్పొరేట్ కాళాశాలలో గత సంవత్సరం మొత్తంలో సుమారు 50 నుంచి 70 మంది విద్యార్థులు ఆ కళాశాలల్లో పెట్టే టెన్షన్ తట్టుకోలేక చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు గానీ, ప్రభుత్వం గానీ స్పందించలేదని విమర్శించారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ కార్పొరేట్ కళాశాలలో జరుగుతున్న దోపిడీలు, వాటిలో అడ్మిషన్లు జరిగితే పిల్లల భవిష్యత్తు ఎలా శూన్యం అయిపోతుందో వివరిస్తూ కరపత్రాలను ముద్రించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి టి.ప్రసాద్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు యు.వినోద్, పి.సుజిత, పి.మోహిని, బి.గణేష్, బి.దేవేంద్ర, స్వాతి, మౌలిక, నాగేంద్ర అర్జున్ పలువురు విద్యార్థులు పాల్గొన్నారు










