Aug 01,2023 22:23

సమావేశంలో మాట్లాడుతున్న పరిటాల సునీత

            అనంతపురం : వైసిపి అధికారంలోకి వచ్చాక రాప్తాడు నియోజకవర్గంలో ఒక్క ఎకరాకైనా పూర్తి స్థాయిలో సాగునీరు ఇచ్చారా అని మాజీ మంత్రి పరిటాల సునీత రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డిని ప్రశ్నించారు. ఈ నెల 3వ తేదీన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆత్మకూరు మండలంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆమె పార్టీ శ్రేణులతో మంగళవారం అనంతపురంలో సమావేశం నిర్వహించారు. చంద్రబాబు పర్యటను విజయవంతం అయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నేతలతో చర్చించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి తీరు చూస్తుంటే పేరూరు ప్రాజెక్టును ఆయనే కటేశాను అనేలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పేరూరు ప్రాజెక్టుకు రూ.10 కోట్లతో నీరు తెస్తానని చెప్పి ప్రగల్బాలు పలికారన్నారు. కాలవల తవ్వకం పేరుతో కోట్ల రూపాయలను వంకల పాలు చేసిన ఘనత ప్రకాష్‌ రెడ్డికే దక్కుతుందన్నారు. వర్షాధారంగా నీరు వస్తే అదికూడా ఆయనే తెచ్చానని గ్లోబెల్‌ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. తాము శాశ్వత ప్రాతిపదికన నియోజకవర్గానికి నిలిచిపోయేలా ప్రాజెక్టులు నిర్మించాలని భావించామని తెలిపారు. చంద్రబాబు నాయుడు గొల్లపల్లి రిజర్వాయర్‌ నిర్మించక పోయి ఉంటే కియా పరిశ్రమ కూడా వచ్చేది కాదని అన్నారు. నాలుగేళ్లుగా మీరు చేసింది ఏంటో చెప్పకుండా వైయస్‌ హయాంలో ఇంత చేసాం... అంత చేశాం అంటూ ప్రగల్బాలు పలుకున్నారన్నారు. కనీసం పనులు చేసిన సబ్‌ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా వారిని బెదిరించి డబ్బులు ఎగ్గొట్టారన్నారు. నాలుగేళ్ల వైసిపి పాలన ప్రజలకు ఒక శాపం లాంటిదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు బుద్ధిచెబుతారన్నారు.