ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల నూతన సంవత్సరణలో భాగంగా ప్రతిపాదిస్తున్న 'ఒక దేశం-ఒకే ఎన్నిక విధానం' ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తాయని మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యకర్త ఏ.చంద్రశేఖర్ అన్నారు. గురువారం విద్వాన్ విశ్వం విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కొండయ్య అధ్యక్షతన ఎన్జీఓ హోమ్‌లో 'ఒక దేశం-ఒకే ఎన్నిక' అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఒకే ఎన్నిక విధానం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోందన్నారు. సాధ్యమయ్యే పరిస్థితి లేదన్నారు. స్వార్థ రాజకీయం అధికారంలో ధీర్ఘకాలికంగా చేపట్టాలని కుటిల ఆలోచన చేస్తున్నట్లు ఉందన్నారు. సాద్యా సాధ్యాలు పరిశీలిస్తే ఒకే సారి దేశ వ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలంటే అత్యధిక సమయం పడుతుందని, ఎన్నికల నిర్వహణ సిబ్బంది, భద్రతా సిబ్బంది, ఇవిఎంలు ఇలా అన్ని కూడా అత్యధికంగా కావాల్సి ఉంటుందన్నారు. ఒకే సారి నిర్వహించాలంటే కనీసం 4 నెలలకు పైబడి వ్యవధి కావాల్సి ఉంటుందన్నారు. ఇప్పటి వరకు దేశంలో ఈ మధ్య కాలంలోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగి ప్రభుత్వాలు ఏర్పాటు అయ్యాయని తెలిపారు. ఆ ప్రభుత్వాలు కూడా రిజాల్వ్ అయి ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంలో తిరిగి ఎన్నికల నిర్వహించాలంటే స్వాగతించ దగినది కాదన్నారు. ఈ విధానంతో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల అధికారాలను గుప్పిట్లో పెట్టుకుని అజమాయిసి చేసే కుట్రలు అన్నారు. రాష్ట్రపతి పరిపాలన విధిస్తే గవర్నర్ చేతుల్లో పరిపాలన వెళుతుందన్నారు. దేశంలో గవర్నర్ వ్యవస్థ ఎలా ఉందో అందరికీ తెలుసన్నారు. ప్రజా మద్ధతుతో ఏర్పాటైన ప్రభుత్వాలను కూల దోసి మరో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న దుస్థితి నెలకొందన్నారు. ఎమ్మెల్యేలు పశువుల కంటే క్షీణంగా అమ్ముడు పోయే వ్యవస్థ దాపురించిందన్నారు. ఈ క్రమంలో ప్రజా అభిప్రాయాలను ప్రతిభింబించే వేదికగా ఎన్నికల వ్యవస్థ నిలిచిందన్నారు. ప్రపంచ దేశాల్లో ప్రభుత్వాలను రీకాల్ చేసే ప్రజాస్వామ్య దేశాలు నేడు ఉన్నాయని, నేడు మన దేశంలో ఆ పరిస్థితులు లేవన్నారు. రాష్ట్రాల స్వేచ్చను హరించే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. రాజ్యసభల హక్కులు కూడా హరించబడే రోజులు వచ్చాయని తెలిపారు. ఐదేళ్లకు ఒకసారైనా ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తీకరించి ప్రభుత్వాలను ఎన్నుకునే వెసులుబాటు ఉందన్నారు. ఒక దేశం ఒక ఎన్నిక విధానం వస్తే ప్రజాస్వామ్యానికి భంగం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. పరిపాలన కార్పొరేట్ శక్తుల చేతుల్లో వెళ్లే ప్రమాదం ఉందన్నారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధం అన్నారు. దీన్ని ప్రజలు వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు. కావున యథాతధంగా ఎన్నికల విధానం అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్వాన్ విశ్వం విజ్ఞాన కేంద్రం కన్వీనర్ ఏజి.రాజమోహన్, సభ్యులు ఎంఎన్‌టి.రాజు, పెన్షనర్‌ల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి సి.పెద్దన్నగౌడ్, శీలా జయరామప్ప, మానవ హక్కుల వేదిక ఎస్‌ఎం.బాషా, బోస్, మానవ హక్కుల వేదిక నాయకులు అబ్దుల్ రసూల్, కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓ.నల్లప్ప, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, యుటిఎఫ్ నాయకులు జిలాన్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యకర్త ఏ.చంద్రశేఖర్










