Oct 05,2023 21:52

ఒడిదుడుకుల్లో వ్యవసాయం

* దశాబ్ద కాలంగా జిల్లాలో పంటల సాగు తగ్గుముఖం
* దీర్ఘకాలం పెండింగ్‌లో సాగునీటి ప్రాజెక్టులు
* పెరగని ఆయుకట్టు
* బీడుగా మారుతున్న వేలాది ఎకరాలు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: జిల్లాలో పంటల సాగు ఏటా తగ్గుతూ వస్తోంది. కరువు, తుపాన్లు, వరదల వంటి విపత్తులతో నిమిత్తం లేకుండా సేద్యం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ఐదేళ్ల పంటల సాగు ప్రాతిపదికగా సాధారణ సాగు విస్తీర్ణాన్ని నిర్ణయిస్తారు. ప్రతి ఏడాది పంటల సాధారణ సాగు విస్తీర్ణం పడిపోతుండగా, అందులో వేలాది ఎకరాలు బీడు భూములుగా మరుతున్నాయి. భూములు సాగుకు యోగ్యంగా ఉన్నా, రైతులు పంటలు వేయలేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. దశాబ్దకాలంగా జిల్లాలో కొత్తగా సాగునీటి వనరులను సృష్టించలేకపోవడం ఈ పరిస్థితికి దారితీస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేకపోవడం, వాటిని సకాలంలో పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి పాలకుల్లో లేకపోవడంతో ఈ దుస్థితి తలెత్తుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

    జిల్లాలో పంటల సాగు ముఖ్యంగా ఖరీఫ్‌ సీజన్‌లో క్రమేణా తగ్గుతూ వస్తోంది. సాగు నీటి సౌకర్యం లేకపోవడంతో పంటల సాగుకు భూమి వినియోగం తగ్గుతోంది. జిల్లా ప్రణాళికా విభాగం గణాంకాలు సాగు తగ్గుదలను స్పష్టం చేస్తున్నాయి. 2014-15 లెక్కల ప్రకారం జిల్లా భౌగోళిక విస్తీర్ణం 50,250 ఎకరాలు కాగా, అందులో 1,71,603 ఎకరాల మేర అటవీ భూమి ఉంది. సాగుకు యోగ్యం కాని భూమి 48,408 ఎకరాలుగా ఉంది. పంటల సాగుకు అనువైన భూమి 10,47,660 ఎకరాలు ఉన్నా, నికరంగా పంటలు 7,59,735 ఎకరాల్లో సాగవుతున్నాయి. పంటల సాగుకు అనువైన భూమి ఉన్నా 72.52 శాతం తగ్గింది. జిల్లా ప్రణాళికా విభాగం చివరిసారిగా సేకరించిన 2019-20 లెక్కల ప్రకారం సాగుకు యోగ్యమైన భూమి 10,84,133 ఎకరాలు ఉండగా, నికరంగా 7,64,285 ఎకరాల్లో పంటల సాగవుతున్నాయి. అంటే సాగుకు అనువుగా ఉన్న భూమిలో 70.50 శాతం మాత్రమే వినియోగంలోకి వచ్చింది. మిగిలిన భూమి నిరుపయోగంగానే ఉంది. ఐదేళ్ల కాలంలో సాగునీటి సౌకర్యమూ పెద్దగా పెరిగిందేమీ లేదు. 2014-15లో పలురకాల సాగునీటి వనరుల ద్వారా 4.55 లక్షల ఎకరాల భూమి వినియోగంలోకి రాగా, 2019-20 నాటికి 4,74,250 ఎకరాలకు సాగునీరు అందింది.
సాగునీటి వనరులు లేకే...
జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయకపోవడం వల్లే వేలాది ఎకరాలు నిరుపయోగంగా మారుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వంశధార ప్రాజెక్టు మొదటి దశ ద్వారా 1,48,230 ఎకరాలు, రెండో దశ ద్వారా 62,280 ఎకరాలకు నీరందించాలని నిర్ణయించినా ఏనాడు లక్ష్యం మేర సాగునీరందించలేదు. వంశధార ఫేజ్‌-2 స్టేజ్‌-2 నిర్మాణ పనులు 2006లో ప్రారంభించినా నేటికీ పూర్తి కాలేదు. ప్రాజెక్టు పూర్తయితే రెండు లక్షల ఎకరాల ఆయుకట్టు స్థిరీకరణతో పాటు రబీకి నీరందించే అవకాశం ఉంది. ఆఫ్‌షోర్‌ పూర్తయితే 24,600 ఎకరాల ఆయుకట్టుకు నీరందేది. 2007లో రూ.127 కోట్లతో ప్రారంభమైన రిజర్వాయర్‌ పనులు ప్రస్తుతం రూ.852 కోట్లకు చేరింది. ఇప్పటివరకు 48 శాతం పనులు మాత్రమే జరిగాయి. పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. తోటపల్లి కొత్త ఆయుకట్టు ద్వారా 38,974 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉన్నా 24,925 ఎకరాలకే సాగునీరు ఇస్తున్నారు. గొర్లె శ్రీరాములు నాయుడు మడ్డువలస రిజర్వాయర్‌ రెండో దశ పథకం కింద సుమారు 25 వేల ఎకరాల వరకు సాగు నీరందించేందుకు 2009లో పనులు ప్రారంభించినా, ఇప్పటికీ కాలువల నిర్మాణానికి భూసేకరణ పెండింగ్‌లో ఉంది.
మినీ రిజర్వాయర్లపైనా 'చిన్న'చూపే
కంచిలి మండలం జలంత్రకోట వద్ద జలంత్రకోటను మినీ రిజర్వాయర్‌గా మార్చేందుకు 2018లో పరిపాలనా అనుమతులు జారీ చేశారు. రిజర్వాయర్‌ పూర్తయితే సమీపలోని 845 ఎకరాలకు సాగునీరందించే అవకాశం ఉంది. రిజర్వాయర్‌ 2019లో పూర్తి కావాల్సి ఉన్నా, ఇప్పటికీ 44.50 శాతం మేర పనులే పూర్తయ్యాయి. ఎల్‌ఎన్‌పేట మండలం జంబాడ వద్ద కడగండి రిజర్వాయర్‌ నిర్మించి 364 ఎకరాలకు సాగునీరు అందించేందుకు 2016లో పరిపాలనా అనుమతులు జారీ చేశారు. 2017లోనే పూర్తి కావాల్సి ఉన్నా, నేటికీ 38 శాతం మాత్రమే పనులు జరిగాయి. మందస మండలం రాయికిల్లోయిగెడ్డకు అడ్డంగా కొత్త చిన్ననీటిపారుదల చెరువును నిర్మించి సమీపంలోని 869 ఎకరాలకు సాగునీరు అందించాలని 2003లో ప్రతిపాదించారు. ఇప్పటికీ పనులకు అతీగతి లేదు. ఇలా సాగునీటి ప్రాజెక్టులు, మినీ రిజర్వాయర్లు సకాలంలో పూర్తి కాకపోవడంతో, వేలాది ఎకరాలు సాగులోకి రాని పరిస్థితి నెలకొంది.
తొమ్మిదేళ్ల కాలంలో పంటల సాగు పరిస్థితి ఇలా...
సంవత్సరం విస్తీర్ణం
(ఎకరాల్లో)
2015 5,97,503
2016 5,84,705
2017 5,45,406
2018 4,53,693
2019 4,28,203
2020 3,72,883
2021 3,63,088
2022 3,66,113
2023 3,81,833