
లాక్‌డౌన్ తర్వాత ఓటీటీకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగింది. అందుకే కొత్తవారితో పాటు అనుభవం ఉన్న నటులూ డిజిటల్ మాధ్యమం వైపు అడుగులు వేస్తున్నారు. ఎందరో నటీనటులు తమలోని నైపుణ్యాన్ని తెర మీదకు తెస్తున్నారు. ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. సీనియర్ నటుడు నరేష్ ప్రధానపాత్ర పోషించిన వెబ్ సిరీస్ 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'. సంగీత్ శోభన్ హీరోగా నిహారిక కొణిదెల నిర్మించిన సిరీస్ ఇది. ప్రముఖ నటులు నాగార్జున, నాని, వరుణ్‌తేజ్ ప్రచారం చేయడంతో ఈ సిరీస్ అందరి దృష్టినీ ఆకర్షించింది. టీజర్, ట్రైలర్.. కుటుంబ సమేతంగా చూడదగ్గ సిరీస్ అని చెప్పకనే చెప్పాయి. మరి దీని కథేంటో తెలుసుకుందాం..!
వెబ్ సిరీస్ : ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ
నటీనటులు : సంగీత్ శోభన్, సిమ్రన్ శర్మ, నరేశ్, తులసి, రాజీవ్ కనకాల, గెటప్ శ్రీను తదితరులు
సంగీతం : పీకే దండి
ఛాయాగ్రహణం : ఎదురోలు రాజు
కథ : మానస శర్మ, మహేష్ ఉప్పాల
దర్శకత్వం : మహేష్ ఉప్పాల
నిర్మాత : నిహారిక కొణిదల
ఓటీటీ : జీ 5
కథలోకి వెళ్తే... హరిదాస్ (నరేష్), రుక్మిణి (తులసి) దంపతుల ముద్దుల తనయుడు మహేష్ (సంగీత్ శోభన్). నిర్లక్ష్య జీవితాన్ని గడిపే యువకుడు. ఇంజనీరింగ్ విద్యనభ్యసించి, ఇంట్లోనే ఖాళీగా ఉంటాడు. 'ఉద్యోగం / పని చేయాల్సిన అవసరం నాకేంటి?' అనుకుంటూ కాలక్షేపం చేస్తుంటాడు. కూర్చోపెట్టి జీతం ఇచ్చే జాబ్ దొరికితే బాగుండనే కలల్లో బతుకుతుంటాడు. వారి వీధిలోనే ఉండే కీర్తి (సిమ్రన్ శర్మ) అనే అమ్మాయిని ఇష్టపడతాడు. మహేష్ చేసే ఏ పనికీ అడ్డు చెప్పకుండా రుక్మిణీ ప్రోత్సాహం అందిస్తుంది. వీరిద్దరి ప్రవర్తన హరిదాస్‌కు నచ్చదు. దాంతో హరిదాస్, రుక్మిణీ- మహేష్ మధ్య రోజూ టామ్ అండ్ జెర్రీ వార్ నడుస్తుంది. చిన్న చిన్న గొడవలు, అరుపులు, నవ్వులు.. ఇలా సరదాగా సాగే కుటుంబంలో ఊహించని విషాదం ఎదురవుతుంది. అకస్మాత్తుగా అతని తండ్రి మరణించడంతో అతని కుటుంబాన్ని పోషించే బాధ్యత అతడిపై పడుతుంది. అప్పుడే తన తండ్రి (నరేష్) రూ.25 లక్షల బ్యాంకు రుణం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఖర్చుల విషయంలో 'బడ్జెట్ పద్మనాభం'లా వ్యవహరించే హరిదాస్ అంత డబ్బు తీసుకోవడం, ఈఎమ్‌ఐల ద్వారా ఆ మొత్తాన్ని తానే కట్టాలనే విషయం మహేష్‌ను షాక్‌కు గురి చేస్తాయి. మరి హరిదాస్ అంత లోన్ ఎందుకు తీసుకున్నాడు? మహేష్ దాన్ని తీర్చగలిగాడా? కీర్తి మనసు గెలిచాడా? అనేదే మిగతా స్టోరీ.
వరంగల్ నేపథ్యంలో సాగే కథ ఇది. బామ్మ, అమ్మ, నాన్న, కొడుకు.. ప్రధాన పాత్రలుగా రూపొందింది. సగటు మధ్యతరగతి ఇంటి యజమాని పడే కష్టాల్ని, బాధల్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. చాలా మధ్యతరగతి కుటుంబాల్లోలానే ఇందులోనూ తల్లీకొడుకు ఓ పార్టీ.. తండ్రి మరో పార్టీగా కనిపిస్తారు. తెలుగులో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. కానీ, సిరీస్‌లు లేవనే చెప్పొచ్చు. ఈ సిరీస్ ఆ లోటుని భర్తీ చేస్తూ ఆద్యంతం వినోదాన్ని పంచుతూ అలరిస్తుంది. ఐదు ఎపిసోడ్స్‌తో.. ఇది కథే, మన పక్కింటివారి కథే అనుకునేంత సహజంగా దర్శకుడు తెరకెక్కించాడు. 'హౌజ్ నం. 9', 'ది ఫస్ట్ ఈఎమ్‌ఐ', 'ఆఫ్ ది మనీ, బై ది మనీ, ఫర్ ది మనీ' అనే ఎపిసోడ్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. పవర్ బిల్లుకు, మీటర్ నంబరుకు తేడా తెలియనంత అల్లారుముద్దుగా పెరిగిన హీరో ఈఎమ్‌ఐ తీర్చేందుకు పడే పాట్లు విశేషంగా అలరిస్తాయి. ఇక 'ఔస్టింగ్ డేస్' అనే ఎపిసోడ్‌తో అసలు కథ మొదలవుతుంది. అప్పటివరకూ నవ్వుల ప్రపంచంలో ముంచెత్తిన దర్శకుడు నెమ్మదిగా ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకునే ప్రయత్నం చేశాడు. 'ట్రూత్ డేర్' అనే ఎపిసోడ్‌తో అది ఇంకాస్త ఎక్కువవుతుంది. అందరూ అనుకున్నట్టుగా తన తండ్రి ఎలాంటి తప్పూ చేయలేదని హీరో తెలుసుకునే సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. కుటుంబ కథకి.. రూ.25 లక్షలు ఏమయ్యాయనే ఉత్కంఠని జత చేసిన విధానం కొత్త అనుభూతి పంచుతుంది. చిన్న సబ్జెక్ట్ అయినా నిడివి ఎక్కువైంది అనే భావన ప్రేక్షకుడికి కలుగుతుంది. ఇక 'రుణాలు', 'ఆర్థిక సంక్షోభం' ట్రాక్ సాపేక్షమైనది. ముగింపు భాగం చక్కగా ప్రదర్శించబడుతుంది.
సంగీత్ శోభన్ ఇందులో ప్రధాన పాత్రధారి అని చెప్పాలి. ఆయన నటించిన రెండో సిరీస్ ఇది. కామెడీ, ఎమోషన్.. అన్ని కోణాల్లోనూ పరిణతి చూపించాడు. కొంతసేపే కనిపించినా నరేష్ తనదైన మార్క్ చూపించారు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తల్లి పాత్రలు పోషించిన తులసి మరోసారి అదే క్యారెక్టర్‌లో కనిపించి, ఆకట్టుకున్నారు. అమాయకత్వంతో ఆమె పంచిన వినోదం అంతా ఇంతా కాదు. రాజీవ్ కనకాల, గెటప్ శ్రీను పాత్ర పరిధి మేరకు నటించారు. సిమ్రన్ శర్మ తన అందం, అభినయంతో మెప్పిస్తుంది. సందర్భానుసారం వచ్చే పాటలు ఫర్వాలేదనిపిస్తాయి. కథ ఎక్కువగా ఇంటి నేపథ్యంలోనే సాగడంతో లొకేషన్లను క్యాప్చర్ చేసే అవకాశం లేకపోయింది. దర్శకుడు మహేష్ ఉప్పల తన కథను ఎలాంటి కన్య్ఫూజన్ లేకుండా చాలా స్పష్టంగా చెప్పగలిగాడు. ఎండ్ పోర్షన్‌ని హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రివర్టింగ్‌గా ఉంది. ఇది థీమ్‌తో మెరిసింది. సినిమాటోగ్రఫీ చాలా నాణ్యంగా ఉంది.