ప్రజాశక్తి-పాలకొల్లు : ఏరువాక పౌర్ణిమ సందర్భంగా చేలల్లో ఉండవలసిన రైతులు పండిన రబీ పంట అమ్ముకోలేక రైస్ మిల్లుల వద్ద పడిగాపులు పడుతున్నారని ఎంఎల్ఏ నిమ్మల రామానాయుడు చెప్పారు. ఆదివారం ఆయన ఆఫీసులో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈరోజు ఆనందంగా ఉండవలసిన రైతులు జగన్ ప్రభుత్వంలో నిరాశ, నిస్పృహతో ఉన్నారని చెప్పారు. ఖరీఫ్ కు ఏరువాకతో పంటను ప్రారంభించవలసిన రైతులు బ్రతుకు జీవుడా అంటూ ధాన్యం అమ్ముకోలేక రోజుల తరబడి రైస్ మిల్లుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు అన్నారు. నాడు ధాన్యం అమ్మితే రైతులకు డబ్బులు వచ్చేవి, కానీ నేడు ధాన్యం అమ్మాలంటే ఎదురు డబ్బులు రైస్ మిల్లులకు కట్టాలని చెప్పారు. కష్టాలలో ఉన్న అన్నదాత దగ్గర కూడా బస్తాకు 10 కేజీల ధాన్యం అదనంగా దోచుకోవడం జగన్ కే చెల్లిందని విమర్శించారు. జగన్ పాలనలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి క్రాప్ హాలిడే బాట పడుతున్నారు అన్నారు. రైతు భరోసా కేంద్రాలు రైతు భక్షక కేంద్రాలుగా, రైతు దగా కేంద్రాలుగా తయారయ్యాయని చెప్పారు. ప్రతి రైతుకు 20వేలు ఆర్థిక సాయం ఇస్తానన్న చంద్రబాబుతోనే రాష్ట్రంలో రైతు రాజ్యం సాధ్యం అన్నారు. ఇంకా మాజీ ఎంఎల్సి అంగర రామ్మోహన్, నియోజకవర్గం పరిశీలకులు చంద్రమౌళి, బోనం నాని, మామిడిశెట్టి పెద్దిరాజు, చెరుకూరి అంజిబాబు పాల్గొన్నారు.










