May 20,2023 15:45

ప్రజాశక్తి-భీమవరం : భేటీ బచావో, భేటీ పడావో అంటూ ఊదరగొడ్తున్న మోదీ మహిళా మల్ల యోధులపై లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను ఎంపి సభ్యత్వం నుంచి తక్షణమే సస్పెన్షన్ చేసి అరెస్టు చేయాలని ఎ.పి మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సికిలే పుష్పకుమారి డిమాండ్ చేశారు.  మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్టు చేసి, ఎంపీ సభ్యత్వం రద్దు చేయాలని మహిళా రెజ్లర్లకు కు న్యాయం చేయాలని కోరుతూ  ఎ.పి.మహిళా సమాఖ్య పశ్చిమ గోదావరి జిల్లా సమితి ఆధ్వర్యంలో శనివారం భీమవరం కలెక్టరేట్ వద్ద మహిళలు ధర్నా నిర్వహించి డిఆర్ఓ కె.కృష్ణవేణి కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ధర్నా నుద్దేశించి ఎ.పి.మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సికిలే పుష్పకుమారి మాట్లాడుతూ ఎన్నో రోజులుగా తమకు న్యాయం చేయాలని పోరాడుతున్న మహిళా మల్ల యోధులకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 
ఫాక్సో చట్టం క్రింద కేసు నమోదయిన వెంటనే నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి విచారణ చేపట్టాలని చట్టంలో స్పష్టంగా ఉన్నా బ్రిజ్ భూషను అరెస్టు చేయకపోవడం వెనుక మోడి హస్తం ఉందని ఆమె ఆరోపించారు.  దేశంలో బిజెపి, ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులకు, కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసే బిజెపి ప్రభుత్వానికి మహిళల పట్ల గౌరవం లేదని వారి సమస్యకు పరిష్కారం చూపించే అవకాశం లేదని మరోసారి మన దేశ రెజ్లర్ల లైంగిక వేధింపుల నేపథ్యంలో రుజువైందని  సికిలే ఎద్దేవా చేశారు. జనవరిలో జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన మహిళా రెజ్లర్లకు తగిన న్యాయం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి అందుకు ప్రత్యేక కమిటీని కూడా నియమించిందని  ఆ కమిటీ రిపోర్టును ఇప్పటివరకు ప్రభుత్వం ఎందుకు బయట పెట్టలేదని సికిలే ప్రశ్నించారు. కమిటీ రిపోర్టును దాచిపెట్టి ఎంపి పై చర్యలు చేపట్టకుండా రెజ్లర్ల సమస్యను పరిష్కరించకుండా పైగా మహిళా రెజ్లర్లపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని బిజెపి ప్రభుత్వం మహిళలపై వివక్షత చూపుతూ బిజెపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను కాపాడుతుందని  ఆమె విమర్శించారు.  భారత మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన సుదీర్ఘ పోరాటాల ఫలితంగా తీసుకొచ్చిన పోస్, ఫాక్సో చట్టాలను నేడు మనువాదులు తుంగలోకి తొక్కుతున్నారని ఆమె దుయ్యబట్టారు. ధర్నాలో భాగం బ్రిజ్ భూషన్ ఎంపి, రెజ్లింగ్ సమాఖ్య పదవుల నుంచి తొలగించి అరెస్టు చేయాలని, పోస్, ఫాక్సో చట్టాలను కఠినంగా అమలు చేయాలని, మహిళా రెజ్లర్లకు వారి కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళలు నినాదాలు చేశారు. కార్యక్రమంలో సోడదాసి సరోజినీ, అన్నెపు లక్ష్మి, ఎస్.పావని, టి.దేవదర్శిని, పి.లక్ష్మి, అడపా దేవి తదితరులు పాల్గొన్నారు.