- నార్పల క్రాసింగ్ నాలుగు రోడ్ల కూడలిలో నిత్యకృతంగా మారిన ప్రమాదాలు .
ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోని స్థానిక క్రాసింగ్ నాలుగు రోడ్ల కూడలిలో స్పీడ్ బ్రేకర్లు లేక రోడ్డు ప్రమాదాలు నిత్య కృత్యంగా మారాయని అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ప్రమాద నియంత్రికలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. వివరాల్లోకి వెళ్తే గత రెండు నెలల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యా వసతి దీవెన పథకం ప్రారంభానికి నార్పలకు రావడంతో నార్పలలో స్థానిక ప్రభుత్వ బాలుల పాఠశాల నుండి ముఖ్యమంత్రి బహిరంగ వేదిక ఏర్పాటు చేసిన క్రాసింగ్ వరకు నూతన రోడ్లను వేయడంతో పాటు ప్రభుత్వ బాలుర పాఠశాల, ప్రాధమిక పాఠశాల ముందు క్రాసింగ్ లోని నాలుగు రోడ్ల కూడలిలో ఉన్నటువంటి స్పీడ్ బ్రేకర్లను తొలగించి తిరిగి ఏర్పాటు చేయలేదు. దీంతో వాహనాలు అత్యంత వేగంగా రావడం ఆ ప్రాంతాల్లో ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయని తెలిపారు. నాలుగు రోడ్ల కూడలిలో ధర్మవరం, తాడిపత్రి, అనంతపురం, నార్పల నుండి వాహనాలు అత్యంత వేగంగా రావడం వేగ నియంత్రికలు లేక ఒకదానికొకటి గుద్దుకుంటున్నాయని అన్నారు. చిన్నాచితకా ప్రమాదాలతో ఇంతవరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని భారీ ప్రమాదం జరిగి ప్రాణనష్టం జరిగితేనే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందిస్తారా అని పలువురు వాహన చోదకులు స్థానికులు ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు.










