
* టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: వైసిపి నాయకులు చేపట్టింది సామాజిక సాధికార యాత్ర కాదని, నయవంచన యాత్ర అని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్ విమర్శించారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసిలు తన వాళ్లంటూ వారి గొంతు కోయడమే సామాజిక న్యాయమా అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు తీరని అన్యాయం చేసిందన్నారు. దళిత డ్రైవర్ సుబ్రమణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును వైసిపి నుంచి బహిష్కరించలేదన్నారు. ఆయన సిఎం జగన్‌తోనే తిరుగుతున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 25 మంది దళితులు హత్యకు గురైనా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అయేషా మీరా, కోడి కత్తి కేసులో నిందితులైన దళితులు సత్యంబాబు, శ్రీను జీవితాలను నాశనం చేశారన్నారు. ఉద్యోగోన్నతుల్లో రిజర్వేషన్లు తీసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో బాక్సైట్‌ను కొల్లగొడుతూ ఎస్‌టిలకు అన్యాయం చేస్తున్నారని చెప్పారు. రిజర్వేషన్లలో పది శాతం కోత పెట్టడంతో రాజ్యాంగబద్ధ పదవులు రాకుండా చేసి బిసిలకు అన్యాయం చేశారని తెలిపారు. సీనియార్టీలో ముందున్న బిసికి చెందిన ద్వారకా తిరుమలరావును పక్కనపెట్టి 14 స్థానంలో ఉన్న రాజేంద్ర రెడ్డిని డిజిపి పదవిలో కూర్చోబెట్టారని విమర్శించారు. 56 కార్పొరేషన్లకు నిధులు కేటాయించలేదని, జిఒ నంబరు 217 ద్వారా మత్స్య వృత్తిని నాశనం చేశారని ఆరోపించారు. రంజాన్ తోఫా రద్దు, దుల్హన్ పథకాన్ని నీరుగార్చి షాదీఖానా నిలిపివేసి మైనార్టీలకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. నవరత్నాలంటూ ప్రజలకు జగన్ నవ మోసాలు చేశారని మండిపడ్డారు. కరెంటు ఛార్జీలు, మద్యం ధరలు, పన్నులు ఇలా అన్ని ధరలు పెంచి 53 నెలల్లో రూ.2,79,136 కోట్లు కొల్లగొట్టారన్నారు. నాసిరకం మద్యం ద్వారా జగన్ ప్రభుత్వానికి రూ.రెండు లక్షల కోట్ల ఆదాయం వస్తే, 35 లక్షల మంది రోగాల బారిన పడ్డారని, 30 వేల మంది మృతి చెందారని ఆరోపించారు. అసంఘటితరంగ కార్మికులకు న్యాయం చేశారని చెప్పారు. పేదలకు పట్టెడు అన్నం పెట్టాలన్న లక్ష్యంతో నెలకొల్పిన అన్నా క్యాంటీన్లను ఎత్తివేసి పేదల పొట్ట కొట్టారని విమర్శించారు. కొత్త మెడికల్ కళాశాలల్లో 30 శాతం రిజర్వేషన్ సీట్లు ఓపెన్ కేటగిరీ కిందకు మార్చి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర బిసిలు పుంగనూరు వెళ్తే వైసిపి నాయకులు చొక్కాలు విప్పి దాడికి యత్నించారన్నారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని సామాజిక యాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలను యాత్రకు వచ్చే వైసిపి నాయకులను అడగాలని ప్రజలను కోరారు.