
ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ, పెళ్లి అనే విషయంలో కన్ఫ్యూజన్ ఉంటూనే ఉంటుంది. అయితే చివరికి చూడ్డానికి అన్ని ప్రేమ కథలూ ఒకేలా ఉంటాయి. అమ్మాయి.. అబ్బాయి... అదే ప్రేమ గొడవలు. అయితే చిన్న చిన్న మార్పులతో ఎన్నో కథలు ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతున్నాయి. ఇదే క్రమంలో పెళ్లిపైనా అనేక చిత్రాలు సినీ అభిమానులను అలరించాయి. అయితే కాస్త భిన్నమైన చిత్రాలు మాత్రమే కలకాలం గుర్తుండిపోయేలా ఉంటాయి. అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ప్రేమ, పెళ్లిపై వచ్చిన కన్ఫ్యూజన్ డ్రామానే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. పెళ్లి అనే బంధం నిలబడాలంటే మోస్ట్ ఎలిజిబిలిటీ ఏంటి అనేదే ఈ చిత్రంలోని కథ. బొమ్మరిల్లు భాస్కర్ చెప్పిన కథ ప్రేక్షకుల్ని మెప్పించిందా? లేదా అనేది తెలుసుకుందాం..!
టైటిల్ : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్
నటీనటులు : అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే, ఆమని, శ్రీకాంత్ అయ్యంగార్, ఈషా రెబ్బా, ఫరియా అబ్దుల్లా, మురళీ శర్మ, పోసాని కృష్ణ మురళి, వి.జయప్రకాష్, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను తదితరులు
నిర్మాణ సంస్థ : జీఏ2 పిక్చర్స్
నిర్మాతలు : బన్నీ వాసు, వాసు వర్మ
దర్శకత్వం : 'బొమ్మరిల్లు' భాస్కర్
సంగీతం : గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ : ప్రదీశ్ ఎమ్. వర్మ
విడుదల తేదీ : అక్టోబర్ 15, 2021
కథలోకి వెళ్తే.. మ్యారేజ్ లైఫ్ బాగుండాలంటే కెరీర్ బాగుండాలని నమ్మే వ్యక్తి హర్ష (అఖిల్ అక్కినేని). అందుకు తగ్గట్లే అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తూ.. మ్యారేజ్ లైఫ్ కోసం ముందే అన్నీ పక్కాగా సెట్ చేసుకుని పెట్టుకుంటాడు. తనపై తనకు ఉన్న నమ్మకంతో పెళ్లికి ముందే ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకుని, అనుకున్న తేదీ కల్లా ఓ మంచి అమ్మాయిని వెతికి పట్టుకునేందుకు రంగంలోకి దిగుతాడు. 20 మంది అమ్మాయిల్ని పెళ్లిచూపులు చూసి.. వాళ్లలో మనసుకు నచ్చిన ఆమెతో ఏడడుగులు వేయాలన్నది తన ప్రణాళిక. తనలా పెళ్లిచూపులు చూడాలనుకున్న అమ్మాయిల్లో స్టాండప్ కమెడియన్ విభా అలియాస్ విభావరి (పూజా హెగ్డే) ఉంటుంది. హర్షలాగే ఆమెకీ పెళ్లి విషయంలో.. రాబోయే జీవిత భాగస్వామి విషయంలో కొన్ని అంచనాలు ఉంటాయి. అయితే ఆమెను పెళ్లి చూపులు చూడకముందే జాతకాలు కలవలేదన్న ఉద్దేశంతో హర్ష కుటుంబం ఆ సంబంధాన్ని రిజెక్ట్ చేస్తుంది. కానీ, హర్ష మాత్రం విభాను చూసిన తొలిచూపులోనే మనసు పారేసుకుంటాడు. ఆమెతోనే పెళ్లి పీటలెక్కాలని కలలు కంటాడు. అయితే విభా మాత్రం హర్ష ప్రేమకు నో చెబుతుంది. ఈ క్రమంలో పెళ్లి విషయంలో ఆమె అడిగిన కొన్ని ప్రశ్నలు.. హర్ష జీవితంలో పెను మార్పులకు కారణమవుతాయి. మరి ఆ ప్రశ్నలేంటి? వాటికి సమాధానం కనుక్కునే క్రమంలో హర్ష తెలుసుకున్న జీవిత సత్యమేంటి? చివరికి తాను అనుకున్నట్లుగా విభా ప్రేమని దక్కించుకున్నాడా? ఆమెతో పెళ్లి పీటలెక్కాడా? లేదా? అన్నది తెరపై చూడాలి.
ప్రేమకథలన్నీ చిన్న లైన్‌తోనే ముడిపడి ఉంటాయి. కానీ, ఆ పాయింట్‌ను ఆయన సరికొత్త ట్రీట్‌మెంట్‌తో చెప్పే తీరు సినీప్రియుల్ని మెప్పిస్తుంటుంది. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'నూ అలాంటి ఓ చిన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న ఓ ఆసక్తికర కథాంశంతోనే రూపొందించారు భాస్కర్. కథ కంటే కథనం మీద ఎక్కువ దృష్టి పెట్టి, మ్యాజిక్ సృష్టిస్తాడు. కానీ ఈసారి మళ్లీ పాత ఫార్మెట్‌ను ఫాలో కావడం కొంత ఆశ్చర్యపరిచే అంశమే. సుమారు పదిసీన్లు పెళ్లి చూపులే ఉంటాయి. అమ్మాయిని చూడటం, ప్రశ్న వేయడం, రిజెక్ట్ కావడం.. అంతా ఇదే తంతు.. ఇది చూసినప్పుడు షాదీ ముబారక్ సినిమా గుర్తుకు వస్తుంది. పెళ్లి చూపుల సీన్లు మొదట్లో ఎంటర్‌టైనింగ్ అనిపించినా రానురాను.. సాగదీతగా అనిపిస్తాయి. విభా పాత్ర సీన్‌లోకి వచ్చాక కథలో వేగం పెరుగుతుంది. ఆమె పరిచయం అయ్యాక.. హర్షతో వచ్చే ఎపిసోడ్లు.. పెళ్లికి కావాల్సిన అర్హతలేంటి? అంటూ ఆమె వేసే ప్రశ్నలు.. ఆ ప్రశ్నలకు సమాధానం రాబట్టే క్రమంలో అతను పడే ఇబ్బందులు ఆసక్తికరంగా సాగుతూనే నవ్వులు పూయిస్తుంటాయి. ప్రేమ, రొమాన్స్‌కి తేడా ఏమిటి? అని చర్చించేందుకు ప్రయత్నించాడు దర్శకుడు. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సింది పోయి మరింత కన్‌ఫ్యూజ్ చేసినట్లు కనిపించింది. ఇంటర్వెల్ సీన్, కోర్టు సన్నివేశాలు మాత్రం హైలైట్‌గా నిలుస్తాయి.
నటన పరంగా అఖిల్ క్లాప్స్ కొట్టించాడు. తనకు సరిగ్గా సూట్ అయ్యే పాత్ర సెలక్ట్ చేసుకుని, నటనతో అదుర్స్ అనిపించాడు. పూజా హెగ్డే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించింది. ముందు నుంచి అనుకున్నట్లు ఆమె పాత్ర డిఫరెంట్‌గా ఉండి, అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది. రియల్ కపుల్ చిన్మయి శ్రీపాద, రాహుల్ రవీంద్రన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. మురళీ శర్మ, ఆమని, జయప్రకాష్ పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. ప్రథమార్ధంలో సుడిగాలి సుధీర్.. పోసాని కృష్ణమురళి, ద్వితీయార్ధంలో వెన్నెల కిషోర్ తమవంతు నవ్వించే ప్రయత్నం చేశారు. ఈషా రెబ్బా, ఫరియా అబ్దుల్లా, నేహా శెట్టి వంటి నాయికల్ని అతిథి పాత్రల్లో ఉపయోగించుకున్న తీరు బాగుంది. గోపీ సుందర్ సంగీతం, ప్రదీశ్ వర్మ ఛాయాగ్రహణం సినిమాకి మరింత బలాన్నిచ్చాయి.