
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్, ఆమదాలవలస:ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు నిర్వహించే శాంతియుత ప్రదర్శనపై పోలీసులు విచక్షణారహితంగా దాడులు చేయడంపై జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ని సూర్యారావు, ఆమదాలవలస బార్ అసోసియేషన్ అధ్యక్షులు కణితి విజయలక్ష్మి తీవ్రంగా ఖండించారు. పోలీసుల వైఖరిని ఖండిస్తూ న్యాయవాదులు సోమవారం విధులు బహిష్కరించి జిల్లా కోర్టు ఆవరణ, ఆమదాలవలసలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ పోలీసుల జులం తగదని, వారిపై కఠిన చర్యలు తీసుకుని న్యాయవాదులకు రక్షణ కల్పించాలన్నారు. ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా న్యాయపరంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అక్కడి న్యాయవాదులకు మద్దతుగా ఒక్కరోజు విధులను బహిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ కార్యదర్శి పొన్నాడ రాము, ఉపాధ్యక్షులు చంద్రమౌళి, న్యాయవాదులు పాల్గొన్నారు.