Oct 16,2023 22:52

మాట్లాడుతున్న సూర్యారావు

ప్రజాశక్తి - శ్రీకాకుళం లీగల్‌: న్యాయవాదుల సంక్షేమం విషయంలో రాజీ లేని పోరాటం చేయాలని పలువురు న్యాయవాదులు పిలుపునిచ్చారు. జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎన్ని సూర్యారావు ఆధ్వర్యాన సోమవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సంక్షేమ నిధి స్టాంపు రుసుం పెంపును వ్యతిరేకించారు. ప్రస్తుతం న్యాయవాదులకు ఆపద సమయంలో చెల్లిస్తున్న రూ.నాలుగు లక్షలను కనీసం రూ.20 లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ మొత్తాన్ని పెంచకుండా ఒక్క సంక్షేమ నిధి స్టాంపు రుసుము పెంపు సరికాదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించి చేస్తున్న ఉద్యమానికి రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఒక మెట్టు దిగి వచ్చి అన్ని బార్‌ అసోసియేషన్ల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో ఈనెల 21న సమావేశం నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. సంక్షేమ నిధి స్టాంపు రుసుము పెంపుతో పాటు న్యాయవాదులకు ఇస్తున్న ఆపత్కాల పరిహారాన్ని పెంచాలని కోరారు. సమావేశంలో సీనియర్‌ న్యాయవాదులు ఎన్‌.విజరుకుమార్‌, జల్లు తిరుపతిరావు, పొన్నాడ వెంకటరమణారావు, ఆంధ్రప్రదేశ్‌ బిసి న్యాయవాదుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆగూరు ఉమామహేశ్వరరావు, చౌదరి లక్ష్మణరావు, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యులు గేదెల వాసుదేవరావు, బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షులు శిష్టు రమేష్‌, బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శి, పొన్నాడ రాము, ఉపాధ్యక్షులు గొంటి చంద్ర మౌళి, మహిళా ప్రతినిధి వి.హరిప్రియ పాల్గొన్నారు.