Sep 27,2023 23:08

నిరసన తెలుపుతున్న న్యాయవాదులు

ప్రజాశక్తి - శ్రీకాకుళం లీగల్‌: న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు డాక్టర్‌ ఎన్ని సూర్యారావు డిమాండ్‌ చేశారు. నగరంలోని జిల్లా కోర్టు ప్రధాన గేటు వద్ద బార్‌ అసోసియేషన్‌, ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లాయర్స్‌, బిసి అసోసియేషన్‌ అడ్వకేట్స్‌ ఆధ్వర్యాన న్యాయవాదులు బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులకు సమాజంలో రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రక్షణ చట్టాలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. న్యాయవాదుల సంక్షేమ నిధిని రూ.నాలుగు లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచాలన్నారు. న్యాయమూర్తుల ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఐఎఎల్‌ రాష్ట్ర కౌన్సిల్‌ మెంబర్‌ కూన అన్నంనాయుడు, బిసి అసోసియేషన్‌ అడ్వకేట్‌ అధ్యక్షులు ఉమామేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చౌదరి లక్ష్మణరావు, సీనియర్‌ లాయర్లు సనపల హరి, పొన్నాడ వెంకటరమణారావు, ఎం.భవానీ ప్రకాష్‌, గోవింద్‌, పొన్నాడ రాము తదితరులు పాల్గొన్నారు.