న్యాయం చేస్తామని ఆర్డీవో హామీ ఇవ్వడంతో... వికలాంగుడు రామచంద్రయ్య దీక్ష విరమణ
ప్రజాశక్తి - పలమనేరు
జగనన్న కాలనీకి తీసుకున్న భూమికి సరిసమానంగా ప్రభుత్వ భూమిని వికలాంగుడు రామచంద్రయ్యకు ఇస్తామని, నెలాఖరు లోపు న్యాయం చేస్తామని ఆర్డీవో హామీ ఇవ్వడంతో దీక్ష ముగిసింది. పలమనేరు రూరల్ మండల రెవెన్యూ పరిధిలోని వికలాంగుడు రామచంద్రయ్య సాగు భూమిని జగనన్న కాలనీకోసం ప్రభుత్వం లాక్కుంది. దీంతో మూడు రోజులుగా ఎంఆర్‌ఒ కార్యాలయం ముందు సిపిఎం, వికలాంగులు జేఏసీ ఆధ్వర్యంలో నిరాహారదీక్ష చేస్తున్నాడు. ఈ విషయమై కుప్పం ఆర్డీవో శివయ్య (పలమనేరు ఇన్‌ఛార్జి) శనివారం దీక్షా శిబిరం వద్దకు విచ్చేసి రామచంద్రయ్య గోడు విన్నాడు. తాను మూడు దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ జీవిస్తున్నానని, పదేళ్ల క్రితం మామిడిచెట్లను ఉపాధి హామీ ద్వారా పెట్టానని, కానీ రెవెన్యూ అధికారులు తనకు ఏమాత్రం తెలియజేయకుండా జగనన్న కాలనీ కోసం మామిడి మొక్కలను తొలగించి 3.16 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారని, తనకు న్యాయం చేయాలని కోరాడు. దీనికి ఆర్డీవో శివయ్య స్పందిస్తూ ఇప్పటికీ ఆ భూమి ప్రభుత్వ భూమిగా ఉందని, కావున జగనన్న కాలనీకోసం స్వాధీనం చేసుకున్నారన్నారు. సిపిఎం నాయకులు ఓబుల్‌రాజు, గిరిధర్‌గుప్తా, ఈశ్వర్, వికలాంగ సంఘం నాయకులు చంద్రశేఖర్, మురళి మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం రామచంద్రయ్యకు న్యాయం చేయాలని కోరారు. ఆర్డీవో స్పందిస్తూ ఈనెల 30 లోపు రామచంద్రయ్య దగ్గర నుంచి ఎంత భూమి తీసుకున్నారో అంత భూమిని తమ రెవెన్యూ అధికారులను పురమాయించి ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంటే ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆర్డీవో శివయ్య రామచంద్రయ్యకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు గోవిందు, సిపిఎం నాయకులు రాజా, జయంతి, ఖైరున్నీసా, పర్వీన్, శాంతమ్మ, బుజ్జమ్మ పాల్గొన్నారు.










