Oct 15,2023 22:01

శ్రీకాకుళం అర్బన్‌ : చేతికి సంకెళ్లు వేసుకుని నిరసన తెలుపుతున్న ఎంపీ రామ్మోహన్‌నాయుడు

ప్రజాశక్తి - విలేకరుల యంత్రాంగం: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు వినూత్న రీతిలో ఆదివారం నిరసన చేపట్టారు. 'న్యాయానికి సంకెళ్లు' పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చేతులకు తాళ్లు, రిబ్బన్లతో సంకెళ్లు వేసుకుని రాత్రి 7 నుంచి 7.05 గంటల వరకు నిరసన వ్యక్తం చేశారు. ఆ దృశ్యాలను వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. శ్రీకాకుళం నగరంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు తన క్యాంపు కార్యాలయంలో నాయకులతో కలిసి చేతులకు తాళ్లు, రిబ్బన్లు కట్టి నిరసన తెలిపారు. చంద్రబాబుకు ప్రాణహాని తలపెట్టాలని వైసిపి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. నగరంలోని గుజరాతీపేటలో చేపట్టిన నిరసనలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పాల్గొన్నారు. ఆమదాలవలస పట్టణంలో టిడిపి కార్యాలయం నుంచి వన్‌వే జంక్షన్‌ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వరకు టిడిపి శ్రేణులతో కలిసి ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ ర్యాలీగా వెళ్లి చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపారు. వైసిపి ప్రభుత్వం చంద్రబాబుపై వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వైసిపికి తగిన బుద్ధి చెప్తారన్నారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు నూక రాజు, కిల్లి సిద్ధార్థ, ఇంజరాపు విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. కవిటి మండలంలోని రామయ్యపుట్టుగలో క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, టిడిపి నాయకులు చేతులకు సంకెళ్లతో నిరసన తెలిపారు. జాడుపుడి ఆర్‌ఎస్‌లో టిడిపి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మానిచంద్ర ప్రకాష్‌, సంతోష్‌ పట్నాయక్‌, బాసుదేవ్‌ రౌలో తదితరులు పాల్గొన్నారు. పలాస మండలంలోని రెంటికోటలో చేపట్టిన నిరసనలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి పి.విఠల్‌రావు, టిడిపి కార్యాలయంలో సీనియర్‌ నాయకులు యార్లగడ్డ వెంకన్న చౌదరి, పట్టణ అధ్యక్షుడు బి.నాగరాజు, సప్ప నవీన్‌, పైల చక్రధర్‌ చేతికి సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపారు. బ్రాహ్మణతర్లాలో టిడిపి నాయకులు వి.యాదగిరి, ఆళ్ల వెంకటరావు తదితరులు నిరసన తెలిపారు. ఇచ్ఛాపురం బస్టాండ్‌ కూడలి వద్ద టిడిపి నాయకులు కాళ్ల ధర్మారావు, ఆసీ లీలారాణి, సహదేవ్‌రెడ్డి తదితరులు చేతికి సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపారు. రణస్థలంలో టిడిపి సీనియర్‌ నాయకులు కలిశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో దేవరపల్లికి చెందిన మహిళలు, గ్రామస్తులు, యువకులతో కలిసి చేతికి సంకెళ్లు వేసుకొని ఊరేగింపు నిర్వహించారు. పొందూరు పట్టణంలోని గాంధీనగర్‌లో టిడిపి మండల అధ్యక్షుడు చిగిలిపల్లి రామ్మోహనరావు ఆధ్వర్యాన, మొదలవలసలో ఎంపిటిసి మొదలవలస సీతారామారావు ఆధ్వర్యంలో న్యాయానికి సంకెళ్లు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపిటిసి-2 అనకాపల్లి వాణి, నాయకులు మద్దెల శ్రీనివాసరావు, కాళ్లకూరి శాంతారాం తదితరులు పాల్గొన్నారు. లావేరు మండలం తాళ్లవలసలో టిడిపి మండల అధ్యక్షుడు ముప్పడి సురేష్‌, లావేరులో ఎచ్చెర్ల ఎఎంసి మాజీ చైర్మన్‌ ఇనపకుర్తి తోటయ్యదొర, బెజ్జిపురంలో మాజీ జెడ్‌పిటిసి పి.మధుబాబు, తామాడలో మాజీ సర్పంచ్‌ గొర్లె శ్రీనువాసురావు, రావివలసలో పార్టీ సీనియర్‌ నాయకులు దారపురెడ్డి కూర్మారావు, అదపాకలో మాజీ ఎంపిపి మీసాల శాంతమ్మ, రమణ ఆధ్వర్యాన చేతులకు తాళ్లతో కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.