Oct 03,2022 15:09
  • పాల్గొన్న జెడ్పీ చైర్మన్ ఎమ్మెల్యే దంపతులు  

ప్రజాశక్తి-వి కోట : మండల కేంద్రమైన వి కోటలోని దుర్గామాత ఆలయంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం నిర్వహించిన దుర్గమ్మవారి పాలాభిషేకానికి భక్తులు పోటెత్తారు. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదివ రోజు దుర్గాష్టమిని పురస్కరించుకొని 1308 పాల కలశాలతో మహిళలు పట్టణ పురవీధుల్లో ప్రదర్శనగా వచ్చి అమ్మవారికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమానికి పలమనేరు శాసనసభ్యులు వెంకటగౌడ చిత్తూరు జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ఎంపీపీ యువరాజ్ దంపతులు అన్ని ఆలయాల ధర్మకర్తలు దంపతులతో పాటు అమ్మవారికి సారెను తీసుకువచ్చి సమర్పించారు. సోమవారం ఉదయాన్నే పెద్దయెత్తున మహిళలు వేణుగోపాలస్వామి ఆలయం వద్దకు చేరుకోగానే వారకి పాల కలశాలు అందచేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆంజనేయస్వామి గుడి మహాత్మాగాంధీ రోడ్డు మీదుగా అమ్మవారి ఆలయం వరకు పాల కలశాలతో శోభాయాత్ర కొనసాగింది. మహిళలందరూ సంప్రదాయ వస్త్రధారణతో తలపై పాల కలశాలను  పెట్టుకొని వచ్చి భక్తి శ్రద్దలతో ప్రదర్శనలో పాల్హొన్నారు. అమ్మవారి నామస్మరణతో పట్టణం మార్మోగింది.