నవరత్నాలతో పేదల జీవితాల్లో వెలుగులు
ప్రజాశక్తి - చిత్తూరుఅర్బన్ :రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు కింద చేపట్టిన ఎన్నో వినూత్నమైన పథకాలను చిత్తూరు జిల్లాలో అందరి సహకారంతో సమర్ధవంతంగా అమలు చేస్తున్నాయని, ఈ ఆర్థిక సంవత్సరం నుండి ఇప్పటి వరకు సాధించిన ప్రగతి వివరాలను మంత్రి ఉష శ్రీచరణ్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ మంత్రి జిల్లా ప్రగతిని వివరిస్తూ ఆరోగ్యమే మహాభాగ్యంగా గ్రామీణ ప్రజలకు ఉత్తమ వైద్యం ఆరోగ్య సంరక్షణ కోసం ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 32 మండలాలలో 44 సంచార వాహనాల ద్వారా 55 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైఎస్‌ఆర్ విలేజ్ హెల్త్‌క్లినిక్ ద్వారా సచివాలయ స్థాయిలో ప్రతి గడపకు వైద్య సేవలు అందిస్తున్నామని, డాక్టర్ వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 3,255 జబ్బులకు ఉచిత వైద్యం అందిస్తున్నమని, డాక్టర్ వైఎస్‌ఆర్ ఆరోగ్య ఆసరా కింద జిల్లాలో ఇప్పటి వరకు 46,873 మందికి రూ.25కోట్లు ఖర్చు చేసామని, 86,520 మందికి ఆపరేషన్లు చేసి రూ.183 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. 'జగనన్న గోరుముద్ద' కింద 2,461 పాఠశాలల్లో ఉన్న 1,63,704 మంది పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం మధ్యాహ్న భోజన పథకం అందిస్తున్నామని, ఈ ఏడాది రూ.41.8 కోట్లు వెచ్చించి 1,67,154 మంది విద్యార్ధులకు జగనన్న కిట్లను సరఫరా చేశామని, రూసా పథకం కింద రూ.14 కోట్లతో ద్రావిడ యూనివర్సిటీ నందు అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టి పూర్తి చేస్తున్నామని, జగనన్న అమ్మఒడి ద్వారా భాగముగా 2022-23 విద్యా సంవత్సరంలో జిల్లాలో 1,53,345 మంది తల్లులకు మొత్తం రూ.229కోట్లు వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు జమ చేశామని, జిల్లాలో 12 ఐసిడిఎస్ ప్రాజెక్ట్‌పరిధిలో 2,420 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ కింద 7నెలల నుండి 3 సంవత్సరాలలోపు గల 59,034 మంది పిల్లలకు బాలామతంతో పాటు కోడిగుడ్లు, పాలు అందజేస్తున్నామని తెలిపారు.
రైతు సంక్షేమంలో భాగంగా ఈ ఏడాది డాక్టర్ వైఎస్‌ఆర్ రైతు భరోసా క్రింద 2,27,010 మంది రైతు కుటుంబాలకు రూ.125 కోట్లు, పిఎం కిసాన్ కింద 2,26,960 మంది రైతు కుటుంబాలకు రూ.45 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసామని, ఉద్యానశాఖ ద్వారా రాష్ట్రీయ కషి వికాస్ యోజన పథకం కింద 150 హెక్టార్లలో పందిరి నిర్వహణ, హైబ్రిడ్ కూరగాయల సాగు పథకాలకు గాను 146 హెక్టార్లు ప్రగతి సాధించామని, జిల్లాలో 39,847 ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తూ రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో ఉన్నామని, ఈ సంవత్సరం జూలై వరకు 1,372 మెట్రిక్ టన్నుల పట్టుగూళ్ళ ఉత్పత్తి చేయగా రూ.698కోట్లు పట్టు రైతులకు ఆదాయం చేకూరిందని తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా మన జిల్లాలో ఇప్పటి వరకు రూ.886 కోట్లు గహ నిర్మాణాల కొరకు ఖర్చు చేశామని తెలిపారు.
జిల్లా పరిషత్ ద్వారా 15 ఆర్థిక సంఘ నిధుల నుండి 2023-24 ఆర్ధిక సంవత్సరం గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సౌకర్యం, శ్మశాన వాటికల అభివద్ధి కొరకు 153 పనులను రూ.10 కోట్లతో చేపట్టామని, జగనన్న స్వచ్చసంకల్పంలో భాగంగా జిల్లాలోని 697 గ్రామ పంచాయతీలకు గానూ 591 గ్రామ పంచాయతీల యందు తడిచెత్త, పొడిచెత్త సేకరించి సాలిడ్‌వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్‌లకు తరలిస్తున్నామని, పంచాయతీరాజ్ శాఖ ద్వారా 328 గ్రామ సచివాలయ భవనాలు, 311 రైతుభరోసా కేంద్రాలు నిర్మించామన్నారు. చిత్తూరు సహకార చక్కెర కర్మాగారంలో 450మంది ఉద్యోగులకు రూ.32.20 కోట్లు బకాయిలు చెల్లించామని, జిల్లాలో కొత్తగా ఏర్పడిన పుంగనూరు డివిజన్‌లో ఈఆర్థిక సంవత్సరం కొత్తగా 6 విద్యుత్ ఉపకేంద్రాలను రూ.18.5కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసి నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని తెలిపారు. చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ.భీమారావు, జెడ్‌పి ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్, ఎస్‌పి వై.రిషాంత్ రెడ్డి, చిత్తూరు ఎంఎల్‌ఏ ఆరణి శ్రీనివాసులు, నగర మేయర్ అముద, జేసి పి.శ్రీనివాసులు, రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ ఛైర్మన్ శాంతి, డిఆర్‌ఓ ఎన్.రాజశేఖర్, ఏఎస్‌పిలు నాగేశ్వర రావు, సుధాకర్ రావు, శ్రీ లక్ష్మీలు, జెడ్పి వైస్‌ఛైర్మన్ రమ్య, జెడ్పి సీఈఓ ప్రభాకర్ రెడ్డి, డిఆర్డిఏ, డ్వామా, హౌసింగ్, మెప్మా పిడిలు తులసి, గంగాభవానీ, పద్మనాభం, రాధమ్మ, చిత్తూరు ఆర్డిఓ రేణుక, జెడ్పి మహిళా స్థాయి సంఘ ఛైర్మన్ భారతి పాల్గొన్నారు.










