Oct 08,2023 21:21

ఫొటో : మాట్లాడుతున్న డాక్టర్‌ ప్రభాకర్‌నాయుడు

నూతన వైద్య విధనాలపై అవగాహన
ప్రజాశక్తి-కావలి : 'డాక్టర్‌ మాలినీదేవి మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌' సౌజన్యంతో కమ్యూనిటీ పారామెడిక్స్‌ అండ్‌ ప్రైమరీ హెల్త్‌ కేర్‌ ప్రొవైడర్స్‌ ( గ్రామీణ వైద్యులు) వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కావలి డివిజన్‌ సభ్యులకు ఆదివారం హాస్పటల్‌ సమావేశ మందిరంలో డివిజన్‌ అధ్యక్షులు పివి రమణయ్య అధ్యక్షతన ''నూతన వైద్య విధానాల''పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సీనియర్‌ వైద్యులు డాక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌ నాయుడు ప్రారంభించి మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటూ ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్న ప్రైమరీ హెల్త్‌ కేర్‌ ప్రొవైడర్స్‌ సేవలు ఎంతో అభినందనీయమని కొనియాడారు.
తక్కువ సమయంలో ప్రారంభించిన డాక్టర్‌.మాలినీదేవి మల్టీస్పెషాల్టి హాస్పిటల్‌లో అత్యాధునిక వైద్య సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్‌ బత్తిన నరేంద్రబాబు, డాక్టర్‌ గొట్టిపాటి మాలినీదేవి ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. వారి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. డాక్టర్‌ నరేంద్ర బాబు, డాక్టర్‌ మాలినీదేవి మాట్లాడుతూ ల్యాప్రోస్కోపీ వైద్య విధానం ద్వారా పేషెంట్‌కు కోత, కుట్లు, రక్తస్రావం లేని, హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం లేని, అత్యాధునిక శాస్త్ర చికిత్స అని, ఈ సర్జరీ ద్వారా పేషంట్‌ తక్కువ సమయంలో కోలుకొని, తన దైనిందిన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని, ఇటువంటి అత్యాధునిక పరికరం తమ హాస్పిటల్‌లో అందుబాటులో ఉందని తెలిపారు. డివిజన్‌ న్యాయ సలహాదారులు పొట్లూరు శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో అందుబాటులో ఉన్న పిహెచ్‌పిలు ప్రథమ చికిత్స అందిస్తూ అత్యవసరమైన కేసులను దగ్గర్లోని స్పెషాలిటీ హాస్పిటల్‌కు రిఫర్‌ చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్‌ శాఖవరపు వేణుగోపాల్‌, డివిజన్‌ గౌరవాధ్యక్షులు షేక్‌.ఖాదర్‌ బాషా, డివిజన్‌ గౌరవ సలహాదారు ఎం.మాలకొండారెడ్డి, డివిజన్‌ నాయకులు చలపతిరావు, జిలాని బాషా 80 మంది సభ్యులు పాల్గొన్నారు.