Sep 28,2023 23:08

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

ప్రజాశక్తి - శ్రీకాకుళం: నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ గురువారం పరిశీలించారు. స్థానిక పిఎస్‌ఎన్‌ఎం స్కూల్‌లో కొత్తగా ప్రతిపాదించిన పోలింగ్‌ కేంద్రాల నంబర్లు 263, 264, 265ను స్వయంగా పరిశీలించి ఆర్‌డిఒ, తహశీల్దార్లకు సూచనలు చేశారు. గతంలో ఉన్న నాలుగు పోలింగ్‌ కేంద్రాలకు అదనంగా మరో మూడు కేంద్రాలను ఓటర్ల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా కేంద్రాల్లో సీలింగ్‌, పవర్‌ సప్లై, కిటికీలు, గది వైశాల్యాన్ని కొలతలు వేసి నివేదిక సమర్పించాలన్నారు. అలాగే ఎన్టీఆర్‌ మున్సిపల్‌ హై స్కూలు, చౌదరి సత్యనారాయణ కాలనీలో నూతన ఏర్పాటు చేయనున్న పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేసి అక్కడ సౌకర్యాలు పరిశీలించాలని సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట ఆర్డిఓ బి.శాంతి, తహాసిల్దార్‌ ఎన్‌.వెంకటరావు, మున్సిపల్‌ కమిషనర్‌ చల్లా ఓబులేసు ఉన్నారు.