అనంతపురం కలెక్టరేట్ : చిన్నారుల ఆరోగ్యానికి, వారి ఎదుగుదలకు హానికరంగా మారిన నులిపురుగులను సమూలంగా నిర్మూలించేందుకు అందరూ కృషి చేద్దామని కలెక్టర్ ఎం.గౌతమి పిలుపునిచ్చారు. గురువారం నాడు అనంతపురం నగరం అరవింద్ నగర్‌లో ఉన్న శ్రీకష్ణదేవరాయ కార్పొరేషన్ మున్సిపల్ హైస్కూల్లో జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ ఎం.గౌతమి హాజరై అల్బెండజోల్ మాత్రలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన పిల్లలే దేశ సంపదకు చిహ్నం అన్నారు. విద్యార్థి దశ నుంచే ఆరోగ్య సూత్రాలు పాటించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నెలకొల్పాలన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి 1 - 19 సంవత్సరాల వయసున్న అందరు పిల్లలకు తప్పనిసరిగా అల్బెండజోల్ మాత్రలను వేసుకోవాలని సూచించారు. అన్ని పాఠశాలల్లోనూ వీటిని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు, విద్యాశాఖ, ఆరోగ్యశాఖ తరఫున అల్బెండజోల్ మాత్రలను పిల్లలందరికీ పంపిణీ చేస్తున్నామన్నారు. పిల్లలు అందరూ తప్పనిసరిగా ఈ మాత్రలను వేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి, కార్మిక సంఘం ప్రతినిధి చవ్వా రాజశేఖర్ రెడ్డి, డిఎంహెచ్‌ఓ డాక్టర్ యుగంధర్, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, డిఇఒ సాయిరాం తదితరులు పాల్గొన్నారు.










