Mar 14,2023 19:01

ప్రజాశక్తి - పాలకొల్లు
పిల్లలకు ఆల్బెండజోల్‌ మాత్రలు తప్పక వాడాలని నరసాపురం సబ్‌కలెక్టర్‌ సూర్యతేజ కోరారు. స్థానిక బిఆర్‌ఎంవి మున్సిపల్‌ హైస్కూల్లో జాతీయ నులి పురుగు నిర్మూలన దినోత్సవంలో భాగంగా మంగళవారం ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం పిల్లలకు ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేశారు. వీవర్స్‌ కాలనీ, పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి జాన్‌ లియో ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు, గవర్నమెంట్‌, ప్రయివేట్‌ పాఠశాలలు, కాలేజీ విద్యార్థులను కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారు. ఎంఇఒ ప్రసాద్‌, డాక్టర్‌ జాన్‌ లియో మాట్లాడారు. అనంతరం జివిఎస్‌విఆర్‌ఎం విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. మలేరియా ఆఫీసర్‌ రాజ్‌ కుమార్‌, హెచ్‌వి అన్నమణి, స్కూలు హెచ్‌ఎం పెద్దిరాజు, కెళ్లా పెద్దిరాజు పాల్గొన్నారు.
పెనుమంట్ర : 19 సంవత్సరాల్లోపు పిల్లలకు మంగళవారం నులిపురుగుల నివారణకు ఆల్‌బెండజోల్‌ మాత్రలను అందిస్తున్నట్లు పిహెచ్‌సి వైద్యులు తెలిపారు. పెనుమంట్ర పరిధిలో 3,915 మంది విద్యార్థులకు నులిపురుగు మాత్రలు అందించినట్లు డాక్టర్‌ కె.లావణ్య తెలిపారు. మార్టేరు ఆరోగ్య కేంద్రం పరిధిలో 14,860 మందికి మాత్రలు అందించినట్లు డాక్టర్‌ కె.కార్తీక్‌ తెలిపారు. ఆలమూరు పిహెచ్‌సి పరిధిలో 2,635 మంది పిల్లలకు మాత్రలు అందించినట్లు డాక్టర్‌ ఎంజి నాయుడు అన్నారు. కార్యక్రమంలో ఆయా పాఠశాల ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు, ఎఎన్‌ఎం, అంగన్వాడీలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉండి : బాల బాలికల్లో నులిపురుగుల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్‌ భాను నాయక్‌ అన్నారు. ఎన్‌ఆర్‌పి అగ్రహారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన నులిపురుగుల నివారణా కార్యక్రమంలో జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్‌ భాను నాయక్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భానునాయక్‌ మాట్లాడుతూ బాలబాలికల్లో నులిపురుగుల వల్ల రక్తహీనత, నీరసం వంటి ఆరోగ్యపరమైన సమస్యలు ఏర్పడతాయన్నారు. పిహెచ్‌సి వైద్యులు పంజా ధర్మతేజ మాట్లాడుతూ తమ పరిధిలో 96 శాతం మందికి ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో పిహెచ్‌సి సిబ్బంది ఆర్‌.కృష్ణకుమార్‌, ఎఎన్‌ఎం లక్ష్మి, ఎంఎల్‌హెచ్‌పి ప్రియాంక పాల్గొన్నారు.
మొగల్తూరు : నులిపురుగు నివారణకు పిల్లలందరికీ మాత్రలు వేయించాలని ఎంపిడిఒ ఆర్‌సి.ఆనంద్‌కుమార్‌ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. నులిపురుగు నివారణా దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు మాత్రలు అందజేశారు. కార్యక్రమంలో ఎఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు ఉన్నారు.