May 24,2023 21:31

ప్రజాశక్తి - ఆచంట
ఖరీఫ్‌లో తేమ శాతం పేరుతో, రబీలో నూకశాతం సాకుతో రైతులను మిల్లర్లు దోచుకుతింటున్నా ప్రభుత్వం, అధికారులు చూసీచూడనట్లు ఉన్నారని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆకుల హరేరామ్‌ విమర్శించారు. మండలంలోని కరుగోరుమిల్లి, కందరవల్లి, వల్లూరు, పెనుమంచిలి గ్రామాల్లో ఆయన పర్యటించి రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం మాసూలు చేసి 20 రోజులైనా సంచులివ్వడం కోసం పది రోజులు ధాన్యం చూసిన తర్వాత పది రోజులు కావస్తున్నా ఇంత వరకూ ట్రాక్టర్లు గాని, లారీలు గాని రాలేదని తెలిపారు. రోజూ కాపలా కాయాల్సి వస్తోందని రైతులు వాపోయారని తెలిపారు. ఒక పక్క నూకశాతం పేరుతో కేజీ 300 గ్రాములు ఎక్కువ తీసుకున్నప్పటికీ ఇంకా రైతులను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు అమలాపురపు నాగేశ్వరరావు, మిద్దే సత్యనారాయణ, గంగోలు సత్యనారాయణ, కాండ్రేగుల నాగేశ్వరరావు, గెద్దాడ రామారావు, కండెల్లి వెంకటలక్ష్మి, వందుర్తి ఆంజనేయులు, గుడాల తిరుపతిరావు పాల్గొన్నారు.