అనంతపురం ప్రతినిధి : గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో కీలకంగా వ్యవహరించేది పంచాయతీరాజ్ శాఖ. రహదారులు మొదలుకుని అనేక రకాలైన ప్రభుత్వ భనవాల నిర్మాణం వంటి పనులను ఈ శాఖనే పర్యవేక్షిస్తుంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ శాఖ పరిధిలో జరుగుతున్న పనులు నత్తనడకనే సాగుతున్నాయి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు సైతం ముందుకు నడవటం లేదు.
ఆరంభానికే నోచుకోని 23 శాతం పనులు
అనంతపురం జిల్లా పరిధిల్లో స్పీల్ వర్క్‌స్ అంటే 2022-23 ఆర్థిక సంవత్సరం కంటే ముందు మిగులున్న పనులు 3686 ఉన్నాయి. వీటికి అదనంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో 73 పనులు మంజూరయ్యాయి. మొత్తం కలిపి 3759 పనులు గత ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందున్నాయి. వీటిల్లో ఇప్పటి వరకు పూర్తయిన పనులు చూస్తే 1191 మాత్రమే పూర్తయ్యాయి. అంటే మొత్తంగా 31 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. తక్కిన వాటిల్లో 1684 పనులు ఇంకా పురోగతిలోనున్నాయి. ఇక పూర్తిగా ప్రారంభానికి నోచుకోనివి 884 పనులున్నాయి. అంటే 23 శాతం పనులకు ఇంకా పునాదిరాయి కూడా పడలేదు.
ప్రతిష్టాత్మక పనులు సైతం...
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాలకు సంబంధించిన పనులు సైతం నత్తనడకనే సాగుతున్నాయి. జగనన్న పాల వెల్లువ కార్యాక్రమంలో కీలకమైన బల్క్‌మిల్క్ కలెక్షన్ కేంద్రాల నిర్మాణం జిల్లాలో 125 చేపట్టాలన్నది లక్ష్యంకాగా ఇప్పటి వరకు పూర్తయింది నాలుగు మాత్రమే. 13 కేంద్రాలు పురోగతిలోనున్నాయి. తక్కిన 108 కేంద్రాల నిర్మాణం ఆరంభానికే నోచుకోలేదు. అదే విధంగా డిజిటల్ లైబ్రరీల నిర్మాణం 136కు నిర్మాణం చేపట్టాలన్నది లక్ష్యం. ఇప్పటి వరకు కట్టింది కేవలం ఒక్కటి మాత్రమే. ఏడు పురోగతిలోనున్నాయి. తక్కిన 178 కేంద్రాల ఆరంభానికి నోచుకోలేదు. సిసి రహదారులు 1827 మంజూరవగా 511 పనులు ప్రారంభమే అవలేదు. రైతు భరోసా కేంద్రాల పరిస్థితి ఇదే రకంగా ఉంది. జిల్లాకు 411 కేంద్రాలు మంజూరయితే 139 మాత్రమే పూర్తయ్యాయి. 182 పురోగతిలోనున్నాయి. తక్కిన రెండు కేంద్రాలు ఆరంభమే కాలేదు. వైఎస్‌ఆర్ హెల్త్ క్లీనిక్‌లు 326కుగానూ 139 మాత్రమే పూర్తయ్యాయి. గ్రామ సచివాలయాలు 469లకుగానూ 301 పూర్తయ్యాయి. తక్కినవి పెండింగులోనున్నాయి.
రూ.63.08 కోట్లు బకాయిలు
పైన పేర్కొన్న పనులన్నీ కలిపి రూ.356.71 కోట్లు పనులు జరిగాయి. ఇందులో రూ.293.63 కోట్లు చెల్లింపులు జరిగాయి. తక్కిన 63.08 కోట్లు బకాయిలున్నాయి. ఇందులో గ్రామ సచివాలయాలకు సంబంధించి రూ.11.64 కోట్లు ఉన్నాయి. సిసి రోడ్లకు సంబంధించి రూ.19.76 కోట్లు, రైతు భరోసా కేంద్రాలకు సంబంధించిన బిల్లులు రూ.9.68 కోట్లు, ఎఎంసి రోడ్ల బిల్లులు రూ.8.05 కోట్లు ఇలా అన్ని రకాల పనులకు సంబంధించి రూ.63.08 కోట్లు బకాయిలున్నాయి. ఈ బకాయిలు చెల్లింపులో నిర్లక్ష్యం కారణంగా పనుల్లో వేగం తగ్గినట్లు కన్పిస్తోంది.










