
* పనుల గుర్తింపు, ప్రతిపాదనలు పంపడంలో ఆలస్యం
* 2,309 పనులకు జిల్లా కమిటీ ఆమోదం
* ఇప్పటివరకు 176 పనులు పూర్తి
* పాత పనులకు బిల్లులు రాకపోవడం జాప్యానికి మరో కారణం
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జిల్లాలో మందకొడిగా సాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు సచివాలయాల సందర్శనకు పెద్దగా సమయం వెచ్చించడం లేదు. దీని ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో నెలకొన్న రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ వంటి సమస్యలకు పరిష్కారం లభించడం లేదు. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరుగనున్నందున ఈ ఏడాది డిసెంబరు లోగా పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నా, క్షేత్రస్థాయిలో పనులు ముందుకు సాగడం లేదు. గడప గడపకు పనుల పూర్తిపై ప్రభుత్వం తొందరగా ఉన్నా, క్షేత్రస్థాయిలో కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. గతంలో పనులు చేపట్టిన వారికి బిల్లులు రాకపోవడంతో వైసిపి స్థానిక నాయకులు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతోపాటు ఎమ్మెల్యేలు గడప గడప లక్ష్యాలను చేరుకోవడంలో వెనుకబాటు కనిపిస్తోంది. ఇళ్ల సందర్శన పూర్తయితే గానీ పనుల గుర్తింపు, మంజూరుకు అవకాశం లేకపోవడంతో పనులు మందకొడిగా సాగుతున్నాయి.
ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల అమలు, అందిస్తున్న ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఇంటినీ ఎమ్మెల్యేలు సందర్శించేలా ప్రభుత్వం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గతేడాది మే 11వ తేదీన ప్రారంభించింది. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని అన్ని ఇళ్లకు వెళ్లాలని ప్రజాప్రతినిధులను ఆదేశించింది. ఇందులో భాగంగా వారు పర్యటించిన ప్రాంతాల్లో మౌలిక వసతులు, కనీస సౌకర్యాల కోసం ప్రజల నుంచి వచ్చే వినతుల కోసం సచివాలయానికి రూ.20 లక్షలు చొప్పున కేటాయిస్తూ 2022 ఆగస్టు 17న జిఒ నంబరు 123 విడుదల చేసింది. పనుల గుర్తింపు, మంజూరు, నిర్వహణ, పర్యవేక్షణపై ప్రత్యేక మార్గదర్శకాలను వెలువరించింది. అందుకనుగుణంగా జిల్లాలో గతేడాది ఆగస్టు నుంచి ఎమ్మెల్యేలు సచివాలయాల సందర్శన మొదలుపెట్టారు. జిల్లాలో 732 సచివాలయాల పరిధిలో 2,477 రకాల పనులకు రూ.70.14 కోట్లతో పరిపాలనా ఆమోదం తెలిపారు. వీటిలో అన్ని మండలాల నుంచి రూ.65.67 కోట్ల విలువైన 2,181 పనులకు సంబంధించి అంచనాలను పంపారు. ఇంకా రూ.14.64 కోట్ల విలువైన 118 రకాల పనులకు సంబంధించి అంచనాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం 1464 పనులు ప్రగతిలో ఉన్నాయి. ఇప్పటివరకు పూర్తయిన 176 రకాల పనులకు రూ.5.47 కోట్ల మేర బిల్లులు చెల్లించారు.
సాంకేతిక సమస్యలతో పనుల్లో జాప్యం
సచివాలయాల వారీగా గుర్తించిన పనుల జాబితాను ఎంపిడిఒలు సంబంధిత గ్రామ, వార్డు సచివాలయాల శాఖకు పంపుతున్నారు. వాటిలో నిబంధనల ప్రకారం ఉన్న పనులకు ఉన్నతాధికారులు అనుమతులు జారీ చేస్తున్నారు. పనుల్లో అత్యధిక భాగం పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్‌శాఖలకు సంబంధించినవే ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. పంచాయతీరాజ్ ద్వారా చేపడుతున్న పనులపై ప్రభుత్వం కొత్తగా కొన్ని మార్గదర్శకాలు వెలవరించడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. గతంలో రూ.2.50 లక్షల పనిని నామినేషన్ పద్ధతిపై అప్పగించేవారు. ప్రభుత్వం కొత్తగా వెలువరించిన మార్గదర్శకాల ప్రకారం వాటికీ టెండర్లను పిలవాలని ఉత్తర్వులు ఇచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ కారణంతో పనుల్లో కొంత జాప్యం చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
పనులకు ఆసక్తి చూపని నాయకులు
గడప గడపకూ పనులను చేపట్టేందుకు గ్రామాల్లో అధికార పార్టీకి చెందిన సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, జెడ్‌పిటిసిలతో పాటు స్థానిక వైసిపి నాయకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. పనులు చేస్తున్నా సకాలంలో బిల్లులు రావడం లేదని వారు చెప్తున్నారు. దీంతో పాటు గతంలో ముఖ్యమంత్రి డెవలప్‌మెంట్ నిధులు (సిఎండిఎఫ్)తో పనులు చేసినా ఆ బిల్లులు నేటికీ రాలేదు. సిఎండిఎఫ్ నిధులు మురిగిపోవడంతో బిల్లులు రావడం సందేహంగా ఉంది. పనుల కోసం రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో కొత్తగా డబ్బులు మదుపు పెట్టడానికి ఎవరూ సాహహించడం లేదు. ఫలితంగా పనులు మంజూరవుతున్నా గ్రౌండింగ్ కావడం లేదు.