ప్రజాశక్తి - పాలకొల్లు
పాలకొల్లులో వంద పడకల ప్రభుత్వాసుపత్రి పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2020 నవంబర్ 20న ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ ప్రభుత్వం నిధుల విడుదలలో జాప్యం చేసింది. రూ.12.5 కోట్లతో 50 పడకల ప్రభుత్వాసుపత్రిని వంద పడకల చేసే ఉద్దేశంతో అప్పటి వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని శంకుస్థాపన చేశారు. అయితే నిధులు విడుదల కాకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీనికితోడు ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు అంతంత మాత్రంగానే సేవలందుతున్నాయి. 1966లో నిర్మించిన ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరుకుంది. అన్ని విభాగాలకు చెందిన వైద్యులూ ఉన్నప్పటికీ వైద్య పరికరాల్లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కోవిడ్ సమయంలో ప్రభుత్వాసుపత్రి సేవలను రోగులు ఎక్కువగా వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఆధునిక పరికరాలు లేకపోవడంతో వారు అవస్థలు పడుతున్నారు. ఈ ఆసుపత్రికి వివిధ మండలాలు, గ్రామాల నుంచి రోజూ అధిక సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. రెండేళ్లుగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో ఆసుపత్రిలో సేవలు తగ్గాయి. ఆసుపత్రిలో సరైన వైద్య పరికరాలు లేకపోవడంతో ప్రజలు ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. వందపడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే ఆధునిక పరికరాలు వస్తాయని ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు ఇవ్వాల్సిన నిధులు విడుదల చేయకపోవడంతో పనులు నత్తనడకగా సాగుతున్నాయి. జెడ్‌పి ఛైర్మన్ కవురు శ్రీనివాస్ జోక్యం చేసుకుని ఆసుపత్రి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.










