అనంతపురం ప్రతినిధి : అకాల వర్షాలు అనంత రైతు నడ్డి విరిచాయి. గత వారంలో అల్పపీడన ప్రభావంతో పడిన వర్షాలకు తీవ్రమైన నష్టాన్నే రైతులకు మిగిల్చాయి. ప్రధానంగా ఆరటి రైతులకు నష్టం వాటిల్లింది. గతంలో ఎన్నడూలేనంతగా అరటి ధర టన్ను రూ.20 వేలకుపైగా పలుకుతోంది. ఇటువంటి సమయంలో వేసవి కాలంలో పంట చేతికొచ్చిన సమయంలో వీచిన గాలివాన, వడగండ్లకు చేతికొచ్చిన పంట నేల రాలింది. ఏపుగా పెరిగిన చెట్లు వాలిపోవడంతో పంట మొత్తం దెబ్బతింది. పంటనష్టంలో అత్యధికంగా అరటి పంటే ఉంది. ఆ తరువాత మామిడి, బత్తాయి పంటలున్నాయి. ఇవి కూడా ఇదేసమయంలో పంటకోతకు వచ్చి ఉన్నాయి. రైతకు చేతికొచ్చిన పంట నోటికందకుండాపోయింది.
16 మండలాల్లో నష్టం
రెండు రోజుల క్రితం జిల్లాలో కురిసిన గాలీవాన, వడగండ్లకు పెద్దఎత్తున ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. సుమారు 16 మండలాల్లో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. 11052 ఎకరాల్లో పంటలు దెబ్బతినింది. సుమారు రూ.211.91 కోట్లు పంటనష్టం వాటిల్లినట్టు ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేశారు. దెబ్బతిన్న పంటల్లో అత్యధికం అరటి పంటే ఉంది. అరటికి మంచి ధర ఉన్న సమయంలో పంట మొత్తం నేలపాలు కావడంతో రైతులు తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
11052 ఎకరాల్లో పంట నష్టం
అధికారుల అంచనాల ప్రకారం సుమారు 16 మండలాల్లో 11052 ఎకరాల్లో పంటనష్టం జరిగింది. నష్టం విలువ రూ.211.91 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. 4612 మంది రైతులకు ఈ నష్టం వాటిల్లింది. జరిగిన నష్టంలోనూ ఎక్కువగా నార్పల, శింగనమల, పుట్లూరు, యల్లనూరు మండలాలున్నాయి. ఈ మండల్లాల్లోనే ఎక్కువగా గాలీవాన, వడగండ్ల వర్షం పడింది. దెబ్బతిన్న పంటల్లోనూ అత్యధికం 6852 ఎకరాల్లో అరటి పంట ఉంది. అంటే దాదాపు యాభై శాతం అరటి పంటయే ఉంది. రూ.166.61 కోట్లు అరటి పంటనష్టంగా అంచనా వేశారు. ఆ తరువాత అత్యధికంగా దెబ్బతిన్న పంట మామిడి. ఇది 1088 ఎకరాల్లో దెబ్బతింది. రూ.18.49 కోట్లు నష్టం వచ్చింది. బత్తాయి పంట 1480 ఎకరాల్లో దెబ్బతినగా ర.21.29 కోట్లు నష్టం వచ్చింది. 375ఎకరాల్లో టమోటా రూ.1.15 కోట్లు నష్టం రాగా, దానిమ్మ 121 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. దీని నష్టం రూ.1.31 కోట్లు. 420 ఎకరాల్లో మిర్చి పంట దెబ్బతినింది. రూ.66 లక్షలు నష్టం వచ్చింది. ఇవి కాకుండా ఇతర పంటలకు నష్టం కలిపి మొత్తం రూ.211. కోట్లు వచ్చింది.
అత్యధికం నాయనపల్లి పరిధిలో..
నార్పల మండలం నాయనపల్లి గ్రామం పరిధిలో అత్యధికంగా పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో అరటి పంట 530 ఎకరాల్లో దెబ్బతింది. దీని నష్టం రూ.31.80 కోట్లు ఉంది. ఆ తరువాత నడిమిదొడ్డి గ్రామంలో రూ.15.60 కోట్లు పంట దెబ్బతింది. మడుగుపల్లిలో రూ.20 కోట్లు, మడ్డిపల్లిలో రూ.26 కోట్లు నష్టం వచ్చింది. ఈ గ్రామాల్లో అత్యధికంగా పంటలు దెబ్బతిన్న వాటిల్లోనున్నాయి.










