Jul 07,2023 15:47
  • నాడు నరేష్ నేడు అనూష...

ప్రజాశక్తి-నార్పల : నార్పలకి చెందిన ఇద్దరు క్రీడాకారులు నరేష్ (వాలీబాల్) అనూషాలు (క్రికెట్)  క్రీడల్లో చక్కటి ప్రతిభను కనబరిచి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదిగి అంతర్జాతీయ స్థాయిలో ఆణిముత్యాలుగా మెరిశారు. నార్పల మండలం క్రీడాకారులకు పుట్టినిల్లు వంటిది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వివరాల్లోకి వెళ్తే మండల కేంద్రమైన నార్పలకు చెందిన నరేష్ నార్పల క్రీడా మైదానంలో వాలీబాల్ లో ఓ నామాలు నేర్చుకొని అప్పటి వ్యాయామ ఉపాధ్యాయుడు నగేష్ సహకారంతో పాటు నరేష్ వాలీబాల్ సీనియర్స్ వద్ద వాలీబాల్ క్రీడలో మెలుకువలు నేర్చుకొని  అంచలంచలుగా మండల స్థాయి నుండి జిల్లా స్థాయికి, జిల్లాస్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి రాష్ట్రస్థాయి నుండి జాతీయస్థాయికి, జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి ఎన్నో అంతర్జాతీయ మ్యాచుల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి  విజయాన్ని చేకూర్చి పెట్టిన నరేష్ ప్రస్తుతం హైదరాబాదులో విజిలెన్స్ శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. నరేష్ స్ఫూర్తితో నార్పల మండలం బండ్లపల్లి గ్రామానికి చెందిన రైతు మలిరెడ్డి కుమార్తె అనూష క్రికెట్ అంతర్జాతీయ జట్టుకు ఎంపిక అయింది. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని బండ్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న అనూష 2014లో గ్రామీణ పాఠశాల క్రీడల్లో క్రికెట్లో అసమానమైన ప్రతిభ చూపడంతో అప్పటి ఆర్డిటి శిక్షకులు అనూషలో ఉన్నటువంటి క్రీడాకారిణిని గుర్తించి ఆర్డిటి అకాడమీకి ఎంపిక చేశారు. అకాడమీలో ఏడు సంవత్సరాల పాటు ఆర్డిటి క్యాంపులో శిక్షణ పొంది ఆర్డిటి శిక్షకుల వద్ద క్రికెట్ క్రీడలో పలు మెలకువలు నేర్చుకున్న అనూష జిల్లా స్థాయి నుండి రాష్ట్రస్థాయి రాష్ట్రస్థాయి నుంచి జాతీయస్థాయి  అంతర్జాతీయ మహిళా క్రికెట్ జట్టుకు ఎంపిక అయ్యింది. అనూష ఆర్డిటిలో శిక్షణ పొందుతూ 2015 నుంచి 17 వరకు ఆంధ్ర అండర్ 16 అండర్ 17 జట్లకు ప్రాతినిధ్యం వహించింది 2017 ౼18లో ఆంధ్ర అండర్ 19 తో పాటు టి20 జట్లకు ప్రాతినిధ్య వహించింది 20౼21లో రాజస్థాన్లో జరిగిన జాతీయ స్థాయి క్రికెట్ పోటీలలో ఆంధ్ర సీనియర్ మహిళా జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. 21౼22లో బెంగళూరులో నిర్వహించిన జాతీయ క్రికెట్ పోటీలలో ఆంధ్ర క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. అదేవిధంగా సీనియర్ ఆంధ్ర మహిళా జట్టు సౌత్ జోన్ ఇండియా ఏ మహిళా జట్టు అండర్ 23 మహిళా జట్టుకు ప్రాతినిధ్యం వహించింది అండర్ 23 భారత మహిళల జట్టు తరుపున హాంగ్కాంగ్ లో జరిగిన ఆసియా కప్ లో కూడా పాల్గొంది. ఇప్పటివరకు అనూష టి20 మ్యాచ్ లో 15 మ్యాచ్లు ఆడి 10 వికెట్లు పడగొట్టింది అదేవిధంగా 17 వన్డేలు ఆడ 27 వికెట్లు తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాదులో జరిగిన జాతీయ క్రికెట్ పోటీల్లో ఈస్ట్ జోన్ పై సౌత్ జోన్ జట్టు తరఫున ఐదు వికెట్లు తీసింది జనవరిలో బరోడాలో జరిగిన నేషనల్ ఛాంపియన్ షిప్ లో త్రిపుర జట్టుపై ఐదు వికెట్లు తీసింది. వరుసగా మూడేళ్ల నుంచి నేషనల్ క్యాంపులకు అనూష ప్రాతినిధ్యం వహిస్తోంది నార్పల మండలానికి చెందిన నరేష్ అనూషాలు వాలీబాల్, క్రికెట్ క్రీడల్లో అసమానమైన ప్రతిభా క్రీడ నైపుణ్యం కనపరచి అంతర్జాతీయ స్థాయికి ఎదగడం అభినందనీయమని నరేష్ అనూష స్ఫూర్తితో నార్పల మండలానికి చెందిన మరింత మంది విద్యార్థులు యువకులు, క్రీడల్లోన రాణించి జాతీయ అంతర్జాతీయ స్థానాల్లో ఉన్నత స్థానాలు అధిరోహిస్తారని సీనియర్ క్రీడాకారులు బాబా సలాం, సంజీవరెడ్డి, రాజగోపాల్, రమేష్ బాబు, రామాంజనేయులు, ప్రకాష్ లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.