కూరగాయలు పండించేందుకు ఆసక్తి చూపని రైతులు
నర్సరీ నిర్వహణలో కష్టాలు ఎదుర్కొంటున్న దంపతులు
ప్రజాశక్తి - ఎస్‌ఆర్‌పురం:
చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం 104 దేవళం పేట గ్రామపంచాయతీ మిట్టమీద రాచపల్లి గ్రామంలో రైతు మునిరెడ్డికి గతంలో ఎస్‌ఆర్‌పురం, గంగాధరనెల్లూరు, వెదురు కుప్పం మండలాలలో పరిచయాలు ఉన్నాయి. ఎస్‌ఆర్‌పురం మండలంలోని జెర్సీ డైరీలో విధులు నిర్వహించారు. కొన్ని కారణాల వల్ల ఆ ఉద్యోగానికి స్వస్తి చెప్పి తన వ్యవసాయ పొలంలో పాడి పరిశ్రమ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ నేపథ్యంలో రైతులకు మిరప, వంకాయ, టమోటా, చెండుమల్లి మొక్కలు అవసరమని గుర్తించి కల్లూరులో నర్సరీ ఏర్పాటు చేసుకున్నారు. ఓ రైతు దగ్గర 25 సెంట్లు భూమిని కౌలుకు తీసుకుని శ్రీవినాయక వెజిటబుల్ పేరుతో నర్సరీ స్థాపించాడు. గతంలో ఎరువులు కూలీలు విత్తనాలు తక్కువ ధరలకు మార్కెట్లో లభించేవి. అప్పట్లో ఏదో కొంత కుటుంబానికి ఆదాయం సమకూరేది ఇది గడిచిన కాలం.
ప్రస్తుతం మునిరెడ్డి, జ్యోతి దంపతులు కల్లూరు దగ్గర నర్సరీలో టమోటా, వంకాయ, పూల మొక్కలు పెంచి రైతులకు అందిస్తూ వుంటారు. గతంలో కరోనా నేపథ్యంలో కూలీలు దొరక్క నానా అవస్థలు పడ్డారని తెలిపారు. ప్రస్తుతం కూలీల రేట్లు పెరిగాయి. దీనికితోడు మొక్కలకు అందించడానికి పక్క రాష్ట్రమైన కర్ణాటకలోని ముల్బాగల్ నుంచి ఎరువులు ఒక టన్ను రూ.6 వేలు చొప్పున ఒక్కసారికి 10 టన్నులు మొలకలు నాటడానికి అవసరమవుతుంది. మేలు రకమైన టమోటా విత్తనాలు కేజీ రూ.90 వేలు మార్కెట్లో ధర పలుకుతుంది. ఎరువులను ట్రేలలో నింపి విత్తనాలు నాటేందుకు రోజుకి నలుగురు కూలీలు పడతారు. ఈ విధంగా సుమారుగా 20 రోజులు కూలీలతో అవసరం ఉంటుంది. ఒక కూలీకి రూ.500. నర్సరీలో మొక్కలకు అవసరమైన నీళ్లను పట్టడం రైతులు పండించేందుకు అవసరమైన మొక్కలను ఇవ్వడం ఈ దంపతులే చూసుకుంటారు. ఇంత వ్యయప్రయాసలకోర్చి నర్సరీ నిర్వహిస్తే అన్ని బాగుంటే ఏదో పది రూపాయలు వస్తుంది లేకపోతే నష్టాలు చవి చూడాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు వారు నర్సరీ నిర్వహణపై ఏవైనా లోను మంజూరు చేస్తే తమ కుటుంబ పోషణకు ఏదో కొంత ఆదుకున్నట్లు ఉంటుందని కోరుతున్నారు. ఆ దంపతులను పలకరించగా వారు కష్టాలను ప్రజాశక్తితో పంచుకున్నారు. ఆ దంపతుల ఆవేదన వారి మాటల్లో ..
రైతులకు నాణ్యమైన మొక్కలను అందిస్తాం...
జిల్లాలోని రైతులకు కావాల్సిన కూరగాయల మొక్క లను నాణ్యమైనవి అందిస్తాము. కంపెనీ విత్తనాలను వాడుతాము. కలుపు సస్యరక్షణ చర్యలు చేపడతాం. సరసమైన ధరలకే రైతులకు అందజేస్తాం. - మునిరెడ్డి శ్రీవినాయక వెజిటేబుల్ నర్సరీ కల్లూరు
అమ్ముడుపోతే ఇబ్బంది లేదు.. పడేస్తేనే నష్టం ....
నర్సరీలో పెంచుకున్న మొక్కలను రైతులు సకాలంలో కొనుక్కుంటే ఏదో కొంత లాభం చేతికందుతుంది. ప్రకతి వైపరీత్యం సంభవిస్తే సకాలంలో రైతులు నర్సరీలకు వచ్చి కొనుక్కోపోతే నారు ముదిరిపోయి తీసి పక్కన పడేస్తే నష్టాల్లో కూరుకుపోవాల్సిందే. - జ్యోతి శ్రీవినాయక వెజిటేబుల్ నర్సరీ నిర్వాహకురాలు కల్లూరు










