Jul 14,2022 22:30

నో బూస్టర్‌..!
వ్యాక్సిన్‌ నిల్వలు కొంతే..
జిల్లాలో స్పష్టత లేని వైనం
నేటి నుంచి పంపిణీ కష్టమే
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి

కేంద్ర కేబినేట్‌ నిర్ణయించిన ప్రకారం నేటి నుంచి బూస్టర్‌ డోసు పంపిణీ కష్టమేనని తెలుస్తోంది. 18 సంవత్సరాలు దాటిన వారందరికీ ఇవ్వడానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా లేదని తెలుస్తోంది. అసలు అందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వడానికి సరిపడా నిల్వలు కూడా జిల్లాలో లేవు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా స్పష్టత రాలేదు. దీంతో ప్రారంభిస్తారు కానీ, ఎప్పటి నుంచి అని మాత్రం తెలపడం కష్టమని అధికారులు చెబుతున్నారు.
కోవిడ్‌ భారి నుంచి కాపాడేందుకు ప్రభుత్వం భారీ ఎత్తున ప్రజలకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం విధితమే. జిల్లాలో దాదాపు అందరికీ దీన్ని వేయించుకున్నారు. అవసరాన్ని బట్టి కోవిషీల్డ్‌, కోవ్యాక్సిన్‌ వ్యాక్సిన్‌ను వేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 83,40,833 మంది వ్యాక్సిన్‌ వేసుకున్నారు. ఇందులో 38లక్షల మంది మొదటి డోసు, రెండు డోసులూ కలిపి వేసుకున్న వారు 41.45లక్షల మంది ఉన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం 60 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే బూస్టర్‌ డోసును అందుబాటులో ఉంచింది. 3.65 లక్షల మంది వేసుకున్నారు. దీన్ని ఉచితంగా ఆయా ప్రాథమిక, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వేస్తున్నారు. ఈ వయస్సు కన్నా తక్కువ ఉన్న వారికి వ్యాక్సిన్‌ కావాలంటే ప్రయివేటుగా వేసుకోవాల్సి వస్తోంది.
దేశవ్యాప్తంగా కోవిడ్‌ కేసులు మరో మారు పెరుగుతున్నాయి. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోనూ కేసులు నమోదవుతున్నాయి. గత ఏడాది ఈ సమయంలో రెండో విడత కరోనా పెద్దఎత్తున వ్యాపించింది. ప్రస్తుతం కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా ఎక్కువగా నమోదు అవుతుండడంతో ఇక్కడ కూడా పెరుగుతుందేమోనని ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా బూస్టర్‌ డోసు వేయాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం జరిగిన కేబినేట్‌ సమావేశంలో నిర్ణయించింది. 75 స్వాతంత్య్ర దినోత్సరం సందర్భంగా వీటిని ఇవ్వాలని నిర్ణయించింది. 75 రోజుల పాటు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటిచింది.
అయితే ఈ ప్రకటన ఆధారంగా జిల్లాలో ఎక్కడా ఈ పరిస్థితి కనిపించడం లేదు. మూడో డోసు తగినంతగా అందుబాటులో కూడా లేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు లేవని అధికారులు చెబుతున్నారు. ఒక వేళ వేయాలంటే మన జిల్లాలో 80లక్షల మందికి వేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం రెండు లక్షల వరకు డోసులు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చిన తరువాత గానీ ఇక్కడ డోసులు అందుబాటులో ఉంచే పరిస్థితి లేదని తెలుస్తోంది. కావున నేటి నుంచి జిల్లాలో బూస్టర్‌ డోస్‌ పంపిణీ కష్టమని తెలుస్తోంది.