Jun 05,2023 22:51

సెల్ఫీ తీసుకుంటున్న మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు

         ప్రజాశక్తి-రాయదుర్గం   కాపు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి తనను ఆడిపోసుకోవడం తప్ప అభివృద్ధి చేసింది శూన్యమని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. సెల్ఫీ ఛాలెంజ్‌లో భాగంగా టిడిపి హయాంలో నిర్మించిన జాతీయ రహదారిపై సోమవారం సెల్ఫీ వీడియో తీసుకుని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత మారుమూల ఉన్న రాయదుర్గాన్ని జాతీయ రహదారుల చిత్రపటంలో నిలిపామన్నారు. తన పట్టుదల, చంద్రబాబు ఆశీస్సుల వల్ల హనగల్‌ నుంచి అనంతపురం వరకూ ఎన్‌హెచ్‌-544 డిడి పేరుతో రూ.549 కోట్లతో రహదారి నిర్మాణం చేశామన్నారు. అలాగే బళ్లారి నుంచి ఉరవకొండ మీదుగా అనంతపురం దాకా జాతీయ రహదారి ఉన్నందున సమీపంలో మరొకటి సాధ్యపడదని కేంద్రం మొదట్లో ఈ ప్రతిపాదనను ఒప్పుకోలేదన్నారు. అయితే కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీని ఒప్పించి రహదారిని మంజూరు చేయించిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. రాయదుర్గం నుంచి గార్మెంట్స్‌ ఉత్పత్తులను దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేయడానికి ఈ రహదారి ఎంతో ఉపయోగపడుతోందన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాపు రామచంద్రారెడ్డి ప్రజలకు పనికొచ్చే ఇలాంటి శాశ్వత పని ఒక్కటైనా చేశారా.. అని ప్రశ్నించారు. అభివృద్ధి చేతగాని కాపు పశుభాషలో తనను విమర్శిస్తూ ఉంటాడన్నారు. కాపు రామచంద్రారెడ్డి ఇప్పటికైనా ఒల్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, లేనిపక్షంలో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.