Mar 19,2023 20:22

ప్రజాశక్తి - భీమవరం
సిపిఎం తొలితరం నాయకులు ఇఎంఎస్‌ నంబూద్రి పాద్‌, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యంను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం అన్నారు. భీమవరం మెంటేవారితోటలోని సిపిఎం జిల్లా కార్యాలయం వద్ద ప్రజా నాట్యమండలి గీతాలాపనలతో ఇరువురి ప్రథమ వర్థంతి ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం వారి చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ భారత స్వాతంత్య్రోద్యమంలో ప్రధాన పాత్ర పోషించారన్నారు. 1957లో భారత దేశంలో మొట్ట మొదటిసారిగా ప్రజాస్వామ్యయుతంగా ఓట్ల ద్వారా గెలుపొందిన తొలి ముఖ్యమంత్రి ఇంఎస్‌.నంబూద్రిపాద్‌ అన్నారు. మల్లు స్వరాజ్యం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, తెలంగాణ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరు, ఉమ్మడి ఆంధ్రరాష్ట్రంలో మహిళా ఉద్యమాన్ని నిర్మించారని తెలిపారు. వందలాది పల్లెలు, శ్రామికులు, కూలీల విముక్తి కోసం తుపాకీ పట్టి పోరాడిన యోధురాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జెఎన్‌వి గోపాలన్‌, బి.వాసుదేవరావు, జిల్లా కమిటీ సభ్యులు జక్కంశెట్టి సత్యనారాయణ, మామిడిశెట్టి రామాంజనేయులు, ఎం.వైకుంఠరావు, కార్యకర్తలు మల్లిపూడి ఆంజనేయులు, ఎస్‌కె.వలీ, బిఎన్‌ఎస్‌.ప్రసాద్‌ పాల్గొన్నారు.
తణుకురూరల్‌ : దోపిడి లేని సమాజం కోసం జీవితాంతం ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌, మల్లు స్వరాజ్యం కృషి చేశారని సిపిఎం జిల్లా నాయకులు జివిఎల్‌ నర్సింహారావు, పివి ప్రతాప్‌ అన్నారు. స్థానిక అమరవీరుల భవనంలో సిపిఎం ఆధ్వర్యంలో నంబూద్రిపాద్‌ 25వ వర్థంతి, మల్లు స్వరాజ్యం మొదటి వర్ధంతి సందర్భంగా వారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరంలో ముందుకు సాగిన వ్యక్తులు నంబూద్రిపాద్‌, మల్లు స్వరాజ్యం అన్నారు. పేదల ప్రభుత్వాన్ని తీసుకురావడానికి వీరు వారి జీవితాన్ని త్యాగం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ధనలక్ష్మి పాల్గొన్నారు.
ఆచంట : భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమంలో ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌, మల్లు స్వరాజ్యం ధృవతారల్లాంటివారని సిపిఎం మండల కమిటీ సభ్యులు వర్ధిపర్తి అంజిబాబు అన్నారు. భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, కేరళ మాజీ ముఖ్యమంత్రి నంబూద్రిపాద్‌, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం వర్థంతిని స్ధానిక ప్రజాసంఘాల కార్యాలయంలో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. తొలుత సిపియం సీనియర్‌ నాయకులు ఇందుకూరి సూర్యనారాయణ రాజు, తోటపల్లి సత్యన్నారాయణ నంబూద్రిపాద్‌, మల్లు స్వరాజ్యం చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంజిబాబు మాట్లాడుతూ సాంప్రదాయ, భూస్వామ్య కుటుంబాల్లో పుట్టిన ఈ మహనీయులు కార్మిక, శ్రామిక వర్గ లక్ష్యాలకు అంకితమై పీడిత ప్రజల హక్కులకై తమ జీవిత చరమాంకం వరకూ పోరాడారని తెలిపారు. ఈ మహనీయులు చూపిన పోరాట మార్గంలో పయనించి, వారి ఆశయాలను నెరవేర్చడమే వారికిచ్చే ఘననివాళి అని అన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు ఎస్‌విఎన్‌.సిర్రా నర్సింహమూర్తి, బొర్రా ధర్మారావు, సత్యన్నారాయణ పాల్గొన్నారు.