May 18,2023 21:44

సమావేశంలో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌

         ప్రజాశక్తి-అనంతపురం   ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులపై దృష్టి సారించాలని జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ కమిషనర్‌ గారి అదేశాల జిల్లా వ్యవసాయ అధికారి బి.చంద్రానాయక్‌ అధ్యక్షతన గురువారం స్థానిక రెవెన్యూ భవన్‌ సమావేశ హాలులో ఉమ్మడి అనంతపురం జిల్లా సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులతో ఒకరోజు వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతోపాటు చట్టాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కమిషనరేట్‌ జెడిఎ కృపాదాస్‌ మాట్లాడుతూ ఖరీఫ్‌ సీజన్‌ సమీపిస్తున్న తరుణంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల సరఫరా కోసం ప్రభుత్వము చర్యలు తీసుకుంటోందన్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. తరచూ ఎరువుల దుకాణాలను విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు, కమిషనరేట్‌ ఎడిఎలు రాజన్‌, సుదర్శన్‌రాజు, మద్దిలేటి, సురేష్‌రెడ్డి, రెండు జిల్లాల సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.